సూర్యాపేట, ఆగస్టు 21 : కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి స్కీం పేరుతో తమకు చేస్తున్న అన్యాయంపై పోరాడాలంటూ సూర్యాపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సాక్షిగా ముఖ్యమంత్రి పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరిగేలా తీసుకున్న శక్తి స్కీం ను వెంటనే ఉపసంహరించుకొని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పక్షాన పోరాటం చేసి కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీయాలని కోరారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన జగదీశ్‌రెడ్డి విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ నెల 30న సూర్యాపేటలోని తాళ్లగడ్డలో నిర్వహించనున్న ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొనాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని కమిటీ సభ్యులు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున, మారిపెద్ది శ్రీనివాస్, బూర బాలసైదులు, కక్కిరేణి నాగయ్య, పుట్ట కిషోర్, గండూరి కృపాకర్, పల్స వెంకన్న, గాలి సాయి ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, హామీలు అమలు చేయకుండా ఆటో కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నం చేయడం దారుణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న చేపట్టనున్న ఆటో కార్మికుల బంద్ పోస్టర్‌ను శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన ఆటో డ్రైవర్లతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా మీటరు చార్జీలను పెంచాలన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ యాప్‌లకు ప్రత్యామ్నయంగా ప్రభుత్వమే స్వయంగా ఒక యాప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12వేల భృతితో పాటు ఈ చాలాన్ల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు.
వాహన సారధి ద్వారా ఆటో డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కొనసాగించాలని, రవాణా వాహనాలకు రేడియం స్టిక్కర్ల విషయంలో జీవో నం 60 ప్రకారం ఆటోలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. 50 యేళ్లు నిండిన ఆటో కార్మికులకు పెన్షన్‌తో పాటు ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 24న నిర్వహించే ఆటో కార్మికుల బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు కుర్రి సైదులు, ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు కె. వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, మట్టయ్య, నరేష్, సోందు, వేణు, రాజు, వెంకన్న, యూసుఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.