Pedda Gattu Jathara | చివ్వెంల, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుపొందింది. రెండేండ్లకోసారి జరిగే ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలకు సుమారు 20నుంచి 25లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒడి శా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టా ల నుంచి యాదవ భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు.
ఐదు రోజుల విశేషాలు
మొదటి రోజు : జాతర ప్రారంభం సందర్భంగా శనివారం సాయంత్రం మకర తోరణాన్ని జిల్లా కేంద్రం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి వారికి అలంకరిస్తారు. ఆదివారం రాత్రి సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపెట్టె(అందనపు సౌడమ్మ)ను గట్టుపైకి చేర్చుతారు. అనంతరం అక్కడకు చేరుకున్న భక్తుల పూజా సామగ్రితో ఉన్న గంపల ప్రదక్షిణ చేపడుతారు.
రెండో రోజు : సోమవారం తెల్లవారుజామున స్వామి వారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. సౌడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు.
మూడో రోజు : గట్టుపైన ఆలయ ప్రాంగణంలో మంగళవారం చంద్రపట్నం వేస్తారు. లింగమంతుల స్వామి(శివుడు) మాణిక్యమ్మ(పార్వతి) కల్యాణ మహోత్సవం జరిపిస్తారు.
నాల్గో రోజు : ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా బుధవారం నెలవారం నిర్వహిస్తారు. దేవరపెట్టెను తిరిగి కేసారం గ్రామానికి తరలిస్తారు.
ఐదో రోజు : జాతర చివరి రోజు దేవతల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజల అనంతరం జాతర ముగుస్తుంది.
వాహనాల మళ్లింపు : పెద్దగట్టు జాతర సందర్భంగా విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారి 65పై వాహనాలు మళ్లించనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్పల్లి వద్ద నల్లగొండ మీదుగా మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ వైపు మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ వద్ద హుజూర్నగర్, నల్లగొండ మీదుగా మళ్లించనున్నారు.
పెద్ద గట్టుకు చేరిన మకర తోరణం
సూర్యాపేట టౌన్ : పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయంలోని సౌడమ్మ తల్లి గుడి ముందు పెట్టడానికి మకర తోరణాన్ని సూర్యాపేట పట్టణంలోని గొల్లబజార్లో కోడి వంశస్తుల నివాసం నుంచి యాదవులు పెద్దఎత్తున ర్యాలీగా పెద్దగట్టుకు చేర్చారు. లింగా.. ఓ లింగా అంటూ భేరీల చప్పుడు, కత్తుల విన్యాసాలతో కదిలివచ్చారు. ఈ సందర్భంగా మకరతోరణం వద్ద రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, పెద్దగట్టు చైర్మన్ పొలెబోయిన నర్సయ్యయాదవ్, ఈఓ కుశలయ్య, వల్లపు రఘువీర్ పూజలు నిర్వహించారు.