సూర్యాపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వేలాదిగా జనం తరలి రావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పట్టణమంతా గులాబి మయంగా మారింది. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైన రోడ్డు షో కోర్టు చౌరస్తా, పూల సెంటర్, పీఎస్ఆర్ చౌరస్తా, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్, శంకర్ విలాస్, గాంధీ విగ్రహం మీదుగా కొత్త బస్టాండ్‌కు చేరింది. ఈ స్థాయిలో జనం వస్తారని ఊహించని బీఆర్ఎస్ నాయకుల్లో ఆనందం కనిపించింది.
ర్యాలీలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పాల్గొని గులాబి దండుతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ర్యాలీ కొత్తబస్టాండ్ వద్దకు చేరుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించేందుకు గంటకు పైనే సమయం పడుతుందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేకూరిన మేలు రెండు క్షణాల్లో చెప్పేందుకు కూడా ఏమీ లేదన్నారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావన్నారు. కూల్చుడు, బెదిరించుడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు దండుకోవటమేనన్నారు. రెండేళ్ల క్రితం ఆ పార్టీ చెప్పిన మాయ మాటలకు మోసపోయి ఓట్లేస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కేసీఆర్ ఇచ్చిన వాటిని కొనసాగించలేని దుస్థితిలో ఉందన్నారు.
మరోసారి మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేస్తే దుర్మార్గానికి లైసెన్స్ ఇచ్చి, రౌడీ చేతికి కర్ర ఇచ్చి, అవినీతికి ఓటేసినట్లేనన్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఓటేస్తే కేసీఆర్ అన్నట్లుగానే మళ్లీ 2014కు ముందటి రోజులు వచ్చాయన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో మీకేం లాభం జరిగిందో ఆలోచన చేయలన్నారు. సీఎం, అయన మంత్రివర్గం దోచుకునే పనిలో పడ్డారన్నారు. మంత్రుల మధ్య సఖ్యత లేక ఒకరి బండారం ఒకరు బయట పెట్టుకుంటున్నారని, వాళ్లు పంపకాల పంచాయితీలే కాదు.. రాసలీలల పంచాయితీలు పెట్టుకోవడం మరీ నీచమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్టుకోవడం వారిపై వారే అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో పాటు బ్యూరోక్రాట్లయిన ఐఎఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులపై కూడా అభండాలు వేయడం దుర్మార్గమన్నారు.
రూ.200 కోట్లను వెనక్కి మళ్లించిన కాంగ్రెస్
తన హయాంలో సూర్యాపేటకు దాదాపు రూ.ఏడువేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసే,్త రెండేళ్లలో జిల్లా మంత్రి నయాపైసా కూడా తేలేదని, తట్టెడు మట్టి ఎత్తిన దాఖలాలు కూడా లేవన్నారు. నాడు కేసీఆర్‌తో మాట్లాడి దాదాపు రూ.200 కోట్ల నిధులు తెస్తే, ఆ జీవోను రద్దు చేశారని దుయ్యబట్టారు. రూ.25 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్, రూ.25 కోట్లతో స్టేడియం ఆధునీకరణతో పాటు మరో రూ.25 కోట్లతో మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనాలు మంజూరు చేయించానన్నారు. భానుపురి కళా భారతి ఏర్పాటుకు రూ.50 కోట్లు, సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కింద రూ.25 కోట్లు తెస్తే ఆ నిధులన్నీ వెనక్కు పంపారన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువులు.. కష్టాలే అని ప్రజలకు అర్థమైందన్నారు. అన్ని మున్సిపాల్టీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సరైన బుద్ధి చెప్పినట్లే ఈ ఎన్నికల్లో కూడా కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.