సూర్యాపేట టౌన్, డిసెంబర్ 25 : యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో జగదీశ్‌రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ వాటి ప్రాధాన్యతను పెంచిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. పదేండ్లుగా ఆయా మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటూ మరింత ఐక్యతను పెంచామని తెలిపారు. క్రిస్మస్, రంజాన్, దసరా పండుగలకు ప్రత్యేక విందులు, దుస్తులు, సామగ్రిని పంచుతూ గంగాజమున తహజీబ్లకు నిలయంగా తెలంగాణ సమాజాన్ని తయారు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.