పోరాటాల పురిటి గడ్డ సూర్యాపేట.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కృషితో చదువుల కోవ్లై 150 మంది వైద్యులను తయారు చేసింది. ఐదేండ్ల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేసి పట్టాలు అందుకున్నారు.
సూర్యాపేట, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేట జిల్లాను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్ని రంగాల్లో ముందుంచారు. ఎవరూ ఊహించని విధంగా మాజీ సీఎం కేసీఆర్ వద్ద పట్టుబట్టి మెడికల్ కళాశాలను తీసుకువచ్చారు. ఆ కృషి ఫలితం నేడు పరిపూర్ణమైంది.
గతంలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు డాక్టర్ చదువంటే కలగా ఉండేది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ప్రైవేట్‌లో వైద్య విద్యను అభ్యసించాలంటే ఏటా రూ.40 లక్షల ఖర్చు చేయాల్సి వచ్చేది. ఐదేండ్లలో సుమారు రూ.2కోట్లు ఖర్చు పెడితే తప్ప డాక్టర్ అయ్యేవారు కాదు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ప్రతిభ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరంలా మారింది.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తే చాలు.. ఏడాదికి ఫీజు రూ.10వేలు, హాస్టల్ ఫీజు మరో వెయ్యి రూపాయలు మాత్రమే. ఐదేండ్లలో ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు రూ.60వేలు సరిపోతున్నాయి. సూర్యాపేటలో 2019 ఆగస్టు 2న నాటి విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతులమీదుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభమైంది. ఐదేండ్ల క్రితం ఈ కళాశాలలో ఎంబీబీఎస్ కోసం జాయిన్ అయిన 150 మంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని తాజాగా పట్టాలతో పాస్అవుట్ అవడం విశేషం.
సూర్యాపేటలో మెడికల్, నర్సింగ్ కళాశాలకు ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కొత్త విద్యార్థులు, అప్పటికే కళాశాలలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులతో మెడికల్ కాలేజీ కళకళలాడుతున్నది. ఇక్కడ 25 పీజీ సీట్లు కూడా ఉండడం గమనార్హం. కళాశాలకు అనుసంధానంగా ఉన్న జనరల్ ఆసుపత్రితో జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో 24 గంటల పాటు అందుతున్నాయి. అత్యాధునిక వసతులు, పెద్ద పెద్ద భవనాల్లో అనుభవజ్ఞులైన వైద్యుల మధ్య బాగా చదువుకుని డాక్టర్లు అయినందుకు సంతోషంగా ఉందని ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్ అవ్వాలన్న నా కలను సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల నేరవెర్చింది. చిన్నతనం నుంచి డాక్టర్ కావాలనే లక్ష్యంగా పెట్టుకుని చదివాను. మా నాన్న రమేశ్ టీవీ మెకానిక్. నా కష్టం చూసి ఎలాగైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించి డాక్టర్ అవ్వాలని కష్టపడ్డాను. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురావడం నాకు చాలా మేలు చేసింది. మాకు దగ్గరలో ఉన్న సూర్యాపేట మెడికల్ కళాశాలను ఆప్షన్ పెట్టుకొని డాక్టర్ కోర్సు పూర్తి చేశాను.
– డాక్టర్ దొడ్డ నితిన్, తొర్రూరు
మా నాన్న పేరు మౌలాలి. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పని చేస్తూ నన్ను చదవించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో నాకు సూర్యాపేటలో సీటు వచ్చింది. దాంతో గతంలో 2కోట్ల రూపాయలు వరకు ఉండే మెడిసిన్ కోర్సు అతి తక్కువ ఖర్చులో పూర్తయ్యింది. నాలుగేండ్ల చదువు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి వెళ్తుంటే అమ్మానాన్న కండ్లలో ఆనందం మాటల్లో చెప్పలేను. డ్రైవర్ కొడుకును డాక్టర్ అయినందుకు నాకూ చాలా సంతోషంగా ఉంది.
– డాక్టర్ ఎం.రోహిత్, అల్లాంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా
మా నాన్న రైతు. మాకు రెండెకరాల భూమి ఉంది. ఉన్న కొద్దిపాటి పొలంలో పంటలు పండీ పండక కుటుంబం గడవడమే కష్టంగా ఉండేది. భూమ్మీద వచ్చే డబ్బుతో నాది, తమ్ముడు, ఇద్దరు అక్కల చదువు నాన్నకు భారమయ్యేది. నా చదువు మరింత భారం కావద్దని బాగా చదివి మెడిసిన్‌లో సీటు తెచ్చుకున్నాను. మాకు దగ్గరలో ఉన్న సూర్యాపేట మెడికల్ కళాశాలను ఎంచుకున్నాను. డాక్టర్ అవ్వాలనే పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఉపయోగ పడింది.
-డాక్టర్ మెగావత్ రాజు, దేవరకొండ