సూర్యాపేట, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో అపారనష్టం జరిగిన విషయం విదితమే. రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి వరి, పత్తి కలిపి 64 వేల ఎకరాల్లో నీటి పాలైంది. ఇది ఎవరో చెప్పిన లెక్కలు కాదు స్వయానా వ్యవసాయశాఖ ప్రాథమికంగా సర్వే చేసి తేల్చింది. ఆ స్థాయిలో రైతులందరికీ పరిహారం చెల్లించడం కష్టతరమని.. ఆ లెక్కలను మార్చేసి పూర్తిగా తగ్గించాలని ప్రభుత్వ ఉన్నత స్థాయి నుంచి వచ్చిన వత్తిడితో తాజాగా తేల్చిన ఫైనల్ లెక్కలను 57 వేల ఎకరాలను తగ్గించి 7 వేలకు కుదించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వరదలు, వడగండ్లతో నష్టపోతున్న రైతులను ఆదుకోకపోగా ఈసారి పంటనష్టం అంచనాలనే తగ్గించడంపై రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
నవంబర్ చివరి వారంలో మొంథా తుపాన్‌తో నష్టపోయిన పంటలకు వేసిన ప్రాథమిక అంచనాలకు.. నేడు ఫైనల్ లెక్కలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా ఏఈవోలతో రెండు రోజుల పాటు సర్వే చేసి పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు వేశారు. నాడు 54,006 ఎకరాల్లో వరి, 10,933 ఎకరాల్లో పత్తి నీట మునిగినట్లు గుర్తించారు. తదనంతరం పూర్తి స్థాయి సర్వే చేస్తే ఇంకాస్త పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇటీవల మళ్లీ సర్వే చేయగా కేవలం 7 వేల ఎకరాల్లో వరి, 23 ఎకరాల్లో పత్తి నష్టపోయినట్లు రికార్డు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం పంటనష్ట అంచనాలను తగ్గించాలని ప్రభుత్వ పెద్దల నుంచి అన్ని జిల్లాలకు ఆదేశాలు అందాయని.. ఈ క్రమంలోనే సూర్యాపేటలో కూడా పంటనష్టం అంచనాలను తగ్గించి చూపిస్తున్నట్లు తెలిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల తుపాన్ కారణంగా నీటి పాలైందని, తమను ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల ఊభినుంచి బయట పడటం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేసి పంటనష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమాజానికి అన్నం పెట్టే రైతన్నల కష్టాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో పలు సంక్షేమ పథకాలతో పాటు పుష్కలంగా నీళ్లు, విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువులు ఇలా అన్నీ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతన్నలను సంతోషంగా ఉంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నీ మాయమైపోతున్నాయి. నాడు ఏదైనా ప్రకృతి వైపరిత్యాల కారణంగా పంటలు నష్టపోతే వెంటనే లెక్కలు వేసి పరిహారం చెల్లించారు. రెండేళ్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో మూడు సార్లు పంటలు నష్టపోగా ఒక్కసారి అరకొరగా కొంతమేర తప్ప పరిహారం చెల్లించలేదనే చెప్పొచ్చు. తాజా మొంథా తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సింది పోయి అధికారులపై వత్తిడి చేసి నష్టాన్ని తగ్గించేలా చేస్తూ రైతుల పొట్ట కొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది.
మొంథా తుపాన్‌తో పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో ప్రభుత్వానికి తగి న గుణపాఠం చెబుతాం. తొలుత సర్వే చేసి ప్రాథమిక అంచనాలు వేసి.. ఫైనల్ లెక్కలు తేల్చితే పది శాతం అటుఇటు ఉంటుంది తప్ప భారీ తేడా ఉండదు. నష్ట పోయిన పంట వివరాలను తగ్గించడంలో ప్రభుత్వ కుట్ర దాగి ఉంది. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సరైన పద్ధతిలో సర్వే చేసి పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలి.
– మట్టిపల్లి సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి