సూర్యాపేట, సెప్టెంబర్ 9 : సూర్యాపేట జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవుతున్నది. సెప్టెంబర్లో తొమ్మి రోజులు జిల్లాలో అత్యధిక వర్షాలు కురిశాయి. 38.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 648 శాతం అధికంగా నమోదైంది. 291.1 మిల్లీమీటర్ల సగటు వర్ష వర్షపాతం కురిసింది.
జిల్లాలో 20 మండలాల్లో అధిక వర్షపాతం, తిరుమలగిరి, నేరేడుచర్ల మండలాల్లో సాధారణ, పాలకవీడు మండలం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. జూన్ నుంచి వర్షాలు ప్రారంభం కాగా ఆ నెలలో 52 శాతం వర్షాలు కురిశాయి. కానీ జూలై, ఆగస్టులో లోటు వర్షపాతం నమోదు కావడంతో వేసవిని తలపించే ఎండలు నమోదయ్యాయి. సెప్టెంబర్లో కురుస్తున్న వర్షాలతో జిల్లా తడిసి ముద్దవుతున్నది.
7 రోజుల్లో 291.1 మిల్లీమీటర్ల వర్షపాతం
సెప్టెంబర్లో 9 వరకు 7 రోజులపాటు కురిసిన వర్షం రికార్డు స్థాయిలో నమోదైంది. 291.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా సెప్టెంబర్లో 9 రోజుల్లో 38.9 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలి కానీ 648 శాతం అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా మోతె మండలంలో 123 శాతం, 7 మండలాల్లో 80 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
సాధారణం గా 2024-25లో జూన్ 1 నుంచి మే 30వరకు సగటున 784.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అధికారుల అంచనా. కానీ ఈఏడాది సెప్టెంబర్ నాటికే 754.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 2023-24లో 714.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గతానికి మించి ఈ ఏడాది వర్షాలు కురిశాయి.
పెరిగిన భూగర్భ జలాలు
భారీ వర్షాలకు భూగర్బ జలాలు భారీగా పెరిగాయి. భూగర్భ గనుల శాఖ ఆగస్టు చివరలో తీసిన లెక్కల ప్రకారం 6.15 మీటర్ల లోతులోనే జలాలు ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్లో కురిసన భారీ వర్షాలకు భూగర్భ జలాలు ఇంకా పైకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నెల చివరి వారంలో తీసే లెక్కల ప్రకారం ఏ స్థాయిలో పెరిగాయో తెలుస్తుంది. ఇప్పటికే చెరువులు 95 శాతం అలుగులు పోస్తున్నాయి.