సూర్యాపేట, జనవరి 26 : కొత్త ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందించాలనే లక్ష్యంగా పని చేస్తుందని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండా ఎగుర వేశారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ ఇప్పటికే మొదలైందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు జిలా ్లవ్యాప్తంగా 21,32,860 మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు.
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారెంటీల కోసం స్వీకరించిన 3,76,419 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని తెలిపారు. యాసంగిలో పంట పెట్టుబడి కోసం 2,93,689 మంది రైతులకు రూ. 317.46 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,79,450 మందికి రూ. 96.76 కోట్లు అందించినట్లు చెప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని 216 స్వయం సహాయక సంఘాలకు రూ. 9.16 కోట్ల వడ్డీలేని రుణాలను పంపణీ చేశామన్నారు.
పరేడ్ గ్రౌండ్లో 6 పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధులు శాదం వెంకట్రెడ్డి, గుడిపాటి అంజయ్య, టంగుటూరి కోటయ్య, బండ పుల్లారెడ్డిని పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో ఘనంగా సన్మానించారు. సుమారు 200 మంది ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు.
భానుపురి జిల్లా మహిళా సమాఖ్యలోని 7,931 సంఘాలకు రూ. 508.97 కోట్లు, 2,750 సంఘాలకు రూ. 90.59 కోట్ల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 స్టాళ్లు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, వెంకట్రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రాజేశ్మీనా, ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎఫ్ఓ సతీశ్కుమార్తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.