సూర్యాపేట టౌన్, మే 23: సూర్యాపేట జిల్లాలోని యల్కారంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్కు చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఆయనను పట్టణంలో ముక్కలుగా నరికి పాశవికంగా హత్య చేశారు. అనంతరం మృతదేహం ముక్కలను గోనె సంచీలో కుక్కి యల్కారం శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో పడేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. శుక్రవారం సూర్యాపేటలోని తన నివాసం నుంచి బయటకు వెళ్లిన మధు సాయంత్రం నుం చి ఫోన్లో అందుబాటులోకి రాలేదు. అర్ధరాత్రి దాటిన తరువాత యల్కారం శివారులోని ఓ పిల్ల కాల్వలో అనుమానాస్పదంగా ఓ మూట కనిపించిందని సమాచారం అందుకున్న పోలీసులు అది మధు మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు.
పేటలోనే హత్య….గోనె సంచిలో తరలింపు..
సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్కడ మద్యం సిట్టింగ్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అక్కడే మధును హతమార్చి అనంతరం మృతదేహాన్ని వాహనంలో యల్కారం గ్రామ శివారులోకి తరలించినట్లు భావిస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలంలోని ఆధారాలను సేకరించింది. మధు 25 ఏండ్ల క్రితం జరిగిన మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు. పాత కక్షల నేపథ్యంలోనే రవీందర్ వర్గీయులు మధును హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యల్కారం ఫ్యాక్షన్ పరంగా సున్నితమైన గ్రామం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
రాజకీయ క్షక్షలకు ఇప్పటివరకు 8మంది బలి..
యల్కారంలో 1985 నుంచి రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. కక్షల కారణంగా ఇప్పటి వరకు 8మంది ప్రాణాలు కోల్పోయారు. 1985లో గ్రామ టీడీపీ నాయకుడు యలగందుల సిద్ధయ్య సూర్యాపేటలో దారుణ హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి తాజాగా జరిగిన మధు హత్య వరకు 8మంది రాజకీయ క్షక్షలకు బలయ్యారు. 1985లో సిద్ధయ్య హత్య అనంతరం కాంగ్రెస్ నేత పల్లె ఈదయ్య, అనంతరం 1996లో సిద్ధయ్య కుమారుడు అజయ్ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి గ్రామం నివురుగప్పిన నిప్పులా ఉంది. అజయ్ హత్య జరిగిన కొద్ది రోజులకే అప్పటి గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనకు చింతలపాటి చిన్న రమేష్ కారణమని భావించి 1999లో రమేశ్‌ను హత్య చేశారు. రమేష్ హత్య అనంతరం కొంత కాలం ప్రశాంతంగా ఉన్న గ్రామంలో తిరిగి 2007లో మిద్దె రవీందర్ హత్య జరిగింది. రవీందర్ హత్యతో పోలీసులు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి మరో హత్య జరుగకుండా అన్ని వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసుల చర్యలు ఫలితాలు ఇవ్వడంతో కొద్ది రోజుల పాటు గ్రామం ప్రశాంతంగానే ఉంది. ఇంతలోనే 2020లో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను గ్రామంలో దారుణంగా హత్య చేశారు. వెంకన్న ప్రత్యర్థి వడ్లె యల్లయ్యను జగ్గయ్యపేట సమీపంలో 2024లో ఆయన ప్రత్యర్థి శ్రీకాంతాచారి హత్య చేశాడు. చింతలపాటి మధు 25ఏండ్ల క్రితం జరిగిన మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు. తాజాగా ఈ హత్యను రవీందర్ వర్గీయులు చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షల వల్ల నలిగిపోతున్న పలు కుటుంబాలు గ్రామం వీడి వలస వెళుతున్నాయి. పోలీసులు ఇకనైనా గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తులో ఎలాంటి రక్తపాతం జరుగకుండా శాంతి భద్రతలు నెలకొనేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
హంతకుల కోసం గాలింపు: ఎస్పీ నర్సింహ
హంతకులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కె.నర్సింహ తెలిపారు. మధు మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానలోని మార్చురీకి తరలించిన అనంతరం ఎస్పీ మధు బంధువులతో మాట్లాడారు. హంతకులను త్వరగా పట్టుకుంటామని కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యల్కారం శివారులో రోడ్డు పక్కనే కల్వర్టు కింద గోనె బస్తాలో శవం ఉందనే సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరి మృతదేహాన్ని బయటకు తీశారన్నారు. గోనె సంచీలో దొరికిన మృతదేహం చింతలపాటి మధుదిగా గుర్తించి బంధువులను పిలిపించి నిర్ధారించామన్నారు. కాగా చింతలపాటి మధు శుక్రవారం ఉదయం 11గంటలకు ఇంట్లో నుంచి వెళ్లాడని ఆచూకీ తెలియడం లేదని సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన భార్య ఫిర్యాదు చేసిందని మొదట ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసి హత్య కేసుగా మార్చామన్నారు. ఈ కేసును సూర్యాపేట సీఐ దర్యాప్తు చేస్తున్నారని డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.