సూర్యాపేట, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల పాలనలో సూర్యాపేట అభివృద్ధిలో పరుగులు పెట్టగా రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.50 కోట్లకు మించి నిధులు రాకపోవడం గమనార్హం. తొమ్మిదేళ్లలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు రూ.18వేల కోట్లు ఉండగా పట్టణ ప్రగతి పేరిట కేసీఆర్ నెల నెలా ఇచ్చిన కోట్లాది రూపాయలతో పాటు సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చినవి రూ.7,500 కోట్లకు పైమాటే. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి దూరమైన సూర్యాపేట అందంగా మారి ఎటు చూసిన ఐకాన్లను తలపించే రీతిన అభివృద్ధి, ఆహ్లాదం, ఆనందాన్ని పంచుతూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మార్క్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సూర్యాపేటను పట్టించుకున్న నాథుడే లేకపోగా అభివృద్ధికి వెచ్చించింది రూ. 35 కోట్లు మాత్రమే. కనీసం జగదీశ్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులను కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
ఉత్తమ్ కుమార్‌రెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నప్పటికీ మొత్తం ఐదారు సార్లు కూడా సూర్యాపేటకు రాకపోవడం గమనార్హం. జగదీశ్‌రెడ్డి హయాంలో జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట నడిబొడ్డుతో పాటు నలు దిక్కులా కనిపించే మెడికల్ కళాశాల, కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, అత్యాధునిక మహాప్రస్థానం, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నర్సింగ్ కళాశాల, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రెండు మినీ ట్యాంక్ బండ్లు, రోడ్ల విస్తరణ, ఎక్కడికక్కడ పచ్చగా కనిపించే 50కి పైగా ఆహ్లాదాన్ని పంచే పార్కులు, విరివిగా ఓపెన్ జిమ్‌లు, ఎస్టీపీ ప్లాంట్, మున్సిపల్ కాంప్లెక్స్ భవనం, విద్యా మౌలిక వసతులు ఇలా చెప్పుకుంటూ పోతే చేసిన పనులు చాంతాడంత ఉన్నాయి. ఇలా అభివృద్ధితో పాటు సంక్షేమానికి కలిపి దాదాపు రూ.7500 కోట్లు వస్తే కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో రూ.3.30 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, జాతర కోసం రూ.5 కోట్లు, రూ.19.70 కోట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, స్వచ్ఛ భారత్ నిధులు రూ. 8.26 కోట్లతో పాటు జలహీఅమృత్ కింద రూ.70 లక్షలు కలిపి రూ.36.96 కోట్లు మాత్రమే వచ్చాయంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ ఆనందం వెలకట్టలేనిది.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న జనం, రెండేండ్ల కాంగ్రెస్ వైఫల్యాలతో బేరీజు వేసుకుంటూ చర్చించుకుంటూ తాను ఎదురైతే పంచుకుంటున్నారు.. ఆ సమయంలో నిజంగా నాకు కలుగుతున్న ఆనందం వెలకట్టలేనిది. ఐదు దశాబ్దాల ఉమ్మడి పాలనలో అరకొర పనులే తప్ప సూర్యాపేట అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సూర్యాపేట ప్రజలు రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే దానిని సద్వినియోగం చేసుకుంటూ కేసీఆర్ సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేయడంతో పేట సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. దీంతో సూర్యాపేట ప్రజల కల సాకారమైంది. రెండేండ్ల క్రితం మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరు తనంతో తాము మోసపోయామని జనం గుర్తించడమే ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాలు. జనం ఏదీ మర్చిపోరనేది తేటతెల్లమైంది. మున్సిపాలిటీల్లో సైతం కనీవిని ఎరుగని రీతిన ఫలితాలు రావడం ఖాయం.