నేరేడుచర్ల, ఏప్రిల్ 26 : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం నేరేడుచర్లలోని మార్కెట్ యార్డులో స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించగా కొనుగోలు కేంద్రం నుండి కేటాయించిన మిల్లులకు తరలిస్తున్న ధాన్యం వే బిల్లుల్లో ధాన్యం తూకం నమోదు చేయకపోవడం పట్ల సీఈఓ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో వేయింగ్ మిషన్ సరిపోవడం లేదని మిల్లుల వద్ద వేబ్రిడ్జిలో వేసిన తూకాన్ని నమోదు చేస్తున్నట్లు సీఈఓ తెలుపగా వేయింగ్ మిషన్ సక్రమంగా లేనప్పుడు కొనుగోలు కేంద్రాన్ని ఎందుకు నిర్వహిస్తున్నావని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రం నుండే సరైన తూకం వేసి సాంద్రత పర్యవేక్షించి మిల్లులకు పంపించాలన్నారు.
రైతులు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం రాశుల వివరాలు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించగా సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. రైతుల ధాన్యం రాశులు ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. ధాన్యం తెచ్చిన రైతుల పేర్లు, వే బిల్లుల్లో వేర్వేరుగా నమోదు చేయడంపై కలెక్టర్ అడుగగా కౌలు రైతులు, రైతుల పేర్లు నమోదు చేసినట్లు సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. వే బిల్లులో ఉన్న రైతుల వివరాలపై హుజూర్‌నగర్‌లో కేటాయించిన శ్రీదేవి మిల్లులో పరిశీలించాలని ఆర్డీఓ శ్రీనివాసులును ఆదేశించారు. అనంతరం స్థానిక హుజూర్నగర్ రోడ్డులో ఉన్న వేర్ హౌస్ గోదామును పరిశీలించి లోడింగ్ అన్లోడింగ్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తాసీల్దార్ సురగి సైదులు, ఎండీఓ సోమ సుందర్‌రెడ్డి, ఎంపీఓ హరిసింగ్ ఉన్నారు.
Nereducherla : ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణపై అసంతృప్తి.. అధికారులపై సూర్యాపేట కలెక్టర్ ఆగ్రహం