సూర్యాపేట, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) ; బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలనెలా పట్టణ ప్రగతి నిధులతోపాటు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నిధుల వరద పారింది. కేసీఆర్ సర్కారు ఉన్న తొమ్మిదిన్నరేండ్లలో జిల్లాలోని మున్సిపాలిటీలకు దాదాపు 50వేల కోట్లు నిధులు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మాత్రం వేతనాలు, విద్యుత్ బిల్లులు, వాహనాల డీజిల్‌కే కష్టమవుతున్నది. గత తొమ్మిది నెలల్లో సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీలకు నయాపైసా నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికి వచ్చి అన్ని శాఖలతో ఒక్క రివ్యూ కూడా పెట్టని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్, ఆయన సతీమణి పద్మావతి ఎమ్మెల్యేగా కోదాడ నియోజకవర్గాలకు మాత్రమే మంత్రిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు కోట్లాది రూపాయలు ఇస్తుండగా సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీలను కనీసం పట్టించుకోవడం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ హయాంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు వివిధ శాఖల మంత్రులను సూర్యాపేటకు తీసుకువచ్చి మున్సిపాలిటీ కోట్ల రూపాయల నిధులు రప్పించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకూ ప్రాధాన్యమిస్తూ రోడ్లు, డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణతోపాటు మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల విడుదల పట్ల పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు నిధులు తీసుకువస్తున్న జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీలను మాత్రం పట్టించుకోవడం లేదు.
చేసిన పనులకూ బిల్లుల్లేవ్..
సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా గత తొమ్మిది నెలల్లో ఒక్కటీ విడుదల కాలేదు. కొత్త పనుల మంజూరు అసలే లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూర్యాపేటకు టీయూఎఫ్ఐడీసీ కింద రూ.30 కోట్లు, ఎస్డీఎఫ్ కింద 50 కోట్లు మంజూరు చేయించి టెండర్లు ద్వారా వర్క్ ఆర్డర్లు ఇప్పించి కొన్ని పనులు చేయించగా ఆ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు నేటికీ ఒక్క రూపాయీ మంజూరు కాలేదు. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని వార్డుల్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.50 కోట్లలో 2.93 కోట్ల పనులు మాత్రమే చేయగా, ఆ మొత్తం కూడా చెల్లించలేదు. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.30 కోట్ల పనులను పర్యవేక్షిస్తున్న పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన రూ.15 కోట్ల పనులకు బిల్లులు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించినా మంజూరు కాలేదు. మిగిలిన రూ.15 కోట్ల పనులకు వర్క్ ఆర్డర్లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోగా తదుపరి ఉత్తర్వుల కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఎస్డీఎఫ్ కింద మంజూరు చేయగా, ఆ నిధుల నుంచి రూ.3.30 కోట్లను 31 వార్డులకు కేటాయించి కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు ఇచ్చి అగ్రిమెంట్ చేశారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన నిధులే రావడం లేదని ఇక కొత్తవి ఏం ఇస్తారోనన్న భయానికి కాంట్రాక్టర్లు కూడా పనులు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేటకు పట్టణ ప్రగతి నిధులు కింద నెలనెలా రూ.46 లక్షలు మంజూరు అయ్యేవి.. కాంగ్రెస్ సర్కారులో ఒక్క నెల కూడా నిధులు విడుదల కాకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సుమారు రూ.6 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
వేతనాలకే ఇబ్బందులు..
అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రధానంగా సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు వంటి అవసరాలకు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇంటి పన్ను, నల్లా బిల్లులు, ట్రేడ్ లైసెన్స్‌లు, బిల్డింగ్ పర్మిషన్ ఫీజుల వంటి నిధుల నుంచి వచ్చే ఆదాయం సిబ్బంది వేతనాలు, నీటి సరఫరా, ఎలక్ట్రికల్, పారిశుధ్య నిర్వహణకే సరిపోవడం లేదు. ఈ నిధుల్లో కూడా బిల్డింగ్ పర్మిషన్ ఫీజు, లే అవుట్ ఫీజు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు గతంలో మున్సిపల్ అకౌంట్లలో జమ అయ్యేవి. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ హెడ్ ఆఫీస్ అకౌంట్లో నేరుగా జమవుతున్నాయి. దాంతో మున్సిపాలిటీల ఆదాయానికి గండి పడింది. జమ అయిన అమౌంట్ ఎంత, మున్సిపాలిటీలకు ఇచ్చేది ఎంత అనే దానిపై లెక్కాపత్రం లేదు. ఆరు నెలల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించడం లేదని తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రవేశపెట్టిన ప్రజాపాలన, స్వచ్చదనం-పచ్చదనం, సీనల్ వ్యాధుల నివారణ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు నిధుల మంజూరు లేకపోవడం గమనార్హం.