మునుగోడు, ఆగస్టు 23 : సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా వర్గ సభ్యుడు గురుజ రామచంద్రం అన్నారు. సీపీఐ మునుగోడు సమితి ఆధ్వర్యంలో శనివారం మునుగోడు అంబేద్కర్ సెంటర్లో సురవరం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి సురవరం విశేష కృషి చేసినట్లు తెలిపారు. ఆయన నేతృత్వంలో పనిచేసిన ఆనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఎదిగారన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త అన్నారు. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ అన్నారు. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్‌గా కీర్తి గడించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, గోస్కొండ లింగయ్య, దయాకర్, వనo వెంకన్న, కట్కూరి లింగస్వామి పాల్గొన్నారు.