యాదగిరిగుట్ట, మార్చి 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు.
అనంతరం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణం జరిపారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి తిరువారాధన చేపట్టి స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.18,54, 142 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,57,450
వీఐపీ దర్శనాలు 45,000
బ్రేక్ దర్శనం 1,12,800
వేద ఆశీర్వచనం 6,600
నిత్య కైంకర్యాలు 2,400
సుప్రభాతం 500
ప్రచార శాఖ 12,000
వ్రత పూజలు 82,000
కల్యాణకట్ట టిక్కెట్లు 44,500
ప్రసాద విక్రయం 8,22,700
వాహన పూజలు 12,800
అన్నదాన విరాళం 19,270
శాశ్వత పూజలు 25,000
సువర్ణ పుష్పార్చన 65,632
యాదరుషి నిలయం 43,344
పాతగుట్ట నుంచి 19,400
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
శివాలయం 5,200
పుష్కరిణి 900
ఇతర విభాగాలు 1,76,646