సూర్యాపేట, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దివాళాకోరు తనంతో యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే దీనినే అదునుగా చేసుకొని కొంతమంది అక్రమార్కులు డబ్బులు సంపాదించే పనిలో పడ్డారు. ప్రధానంగా రైతులు అత్యధికంగా వినియోగించే దొడ్డు రకం యూరియా విషయంలో గతంలో ఏనాడూ అధికారులు ప్రత్యేకంగా కోటా కేటాయింపులు పెట్టకపోగా ఈ సారి పీఏసీఎస్‌లకు కాకుండా డబ్బులు దండుకొని ఇతర సంస్థలకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో అసలే పీఏసీఎస్‌ల వద్ద యూరియా దొరకడం లేదంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతాంగానికి అగ్రి రైతు సేవాకేంద్రం, ఎన్డీసీఎంఎస్, ఫార్మర్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్లలో యూరియా కొనుగోలులో ఇతర పురుగుల మందులను లింకు పెట్టి విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు వచ్చే యూరియాను 60 శాతం పీఏసీఎస్‌తో పాటు ఇతర ఆర్గనైజేషన్లకు కేటాయించనుండగా 40 శాతం ఆయా కంపెనీల ఏజెన్సీలు కలిగిన ప్రైవేట్ షాపులకు కేటాయిస్తారు. యూరియాలో దొడ్డురకం, సన్నరకం ఉండగా రైతులు మాత్రం దొడ్డు రకం మాత్రమే తమ పొలాల్లో వేయడానికి ప్రాధాన్యత ఇస్తారు.
గత్యంతరం లేకుంటే తప్ప సన్న యూరియాను అసలే కొనుగోలు చేయరు. 60 శాతంలో మెజారిటీ పీఏసీఎస్‌లకు కేటాయించడం ఆనవాయితీ. కానీ గత కొద్ది రోజులుగా జిల్లాలో పీఏసీఎస్‌లకు వద్ద యూరియా దొరకడం లేదని నిరసనలు చేస్తున్న రైతాంగానికి అగ్రి రైతు సేవాకేంద్రం, ఎన్డీసీఎంఎస్, ఫార్మర్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్లలో యూరియాతో పాటు ఇతర ఎరువుల మందులను బలవంతంగా అంటగట్టి విక్రయిస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. వాస్తవానికి పీఏసీఎస్‌లకు కాకుండా ఇతర సంస్థలకు దొడ్డు రకం కేటాయింపుల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ పీఏసీఎస్ సెంటర్ వారు సన్న యూరియా పంపడంతో అధికారులపై మండిపడుతూ ఉన్నతాధికారులను కలుస్తానని బెదిరించడంతో వెంటనే ఆ సెంటర్‌కు దొడ్డు రకం పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి సారి కంటైనర్ రాగానే ఒక్కో షాపు నుంచి రూ.15 నుంచి 20వేలు తీసుకొని వారికే కేటాయిస్తున్నారని దీనిపై వెంటనే ఉన్నతాధికారులు కల్పించుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
త్రిపురారం, సెప్టెంబర్ 2 : పిల్లాపాపలను తీసుకొని అన్నం, నీళ్లు నిద్రాహారాలు మానుకొని తెల్లవారుజామున 3గంటల నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని అయినా యూరియా దొరకడంలేదని మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను సైతం పాఠశాలలు మాన్పించి యూరికోసం క్యూలైన్లలో నిలబెడ్తున్నామని అయినప్పటికీ యూరియా కట్టలు లభించడం లేదని రైతులు అంటున్నారు. నెల రోజులైనా యూరియా వేయకపోవడంతో నకిరం పడుతున్నాయని, పైరు ఎదిగి దుబ్బు కడితేనే దిగుబడి వస్తుందని, అందుకోసం వేయాల్సిన ఎరువులు వేయలేకపోతున్నామని రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. భార్యాపిల్లలతో అర్థరాత్రి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపురారం టౌన్‌కు వెళ్లి వస్తున్నా యూరియా దొరకడం లేదని రైతులు అంటున్నారు.
ఎన్ని తిప్పలు పడినా యూరియా దొరకడం లేదని, బడికి వెళ్లాల్సిన పిల్లలను క్యూలో నిలబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 600 మంది యూరియా కోసం వస్తే సగం మందికి కూడా దొరకడంలేదన్నారు. ప్రభుత్వం, వ్యవసాయాధికారులు రైతుల గోస పట్టించుకోవడం లేదని, రైతులకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 2 : మునుపెన్నుడు లేని విధంగా యూరియా కోసం అరిగోస పడుతున్నం. యూరియా కోసం విక్రయ కేంద్రాల వద్దకు వెళితే గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తామంటూ షాపు యజమానులు కొర్రీలు పెడుతున్నారు. యూరియా కోసం రైతులంతా వ్యవసాయ పనులు వదిలి రోజుల తరబడి క్యూలైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోని రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.
అర్వపల్లి, సెప్టెంబర్ 2: రైతులను పట్టించుకోని ఈ ప్ర భుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు రైతుల ఉసురు తగులుతుంది. మరో 20 రోజుల్లో పంట చేతి కి వచ్చే దశలో ఎరువులు ఇయ్యకపోవడం సిగ్గుచేటు. తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతుల ఉసురు ప్రభుత్వానికి తగలక తప్పదు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతున్న ఎమ్మెల్యేకు రైతుల గోస తెలియదా.. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు.
హుజూర్నగర్ రూరల్, ఆగస్టు 2 : రాష్ట్రంలోని రైతులకు యూరియా దొరికే పరిస్థితి లేదు. బంగారమైనా షాపులో దొరుకుతుంది కానీ యూరియా దొరకడంలేదు. రైతులు నాట్లు వేసి 25 రోజులు కావొస్తోంది. ప్రభుత్వం ప్రైవేట్ దళారులకు యూరియా అప్పజెప్ప డం దారుణం. దళారులు గుళికలు తీసుకుంటేనే యూ రియా ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్రు. గతంలో వ్యవసాయం చేస్తే ఎన్నడూ యూరియా కొరత లేదు.
తిరుమలగిరి సెప్టెంబర్ 2: యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పటం లేదు. రోజు రోజుకూ యూరియా కొరత వేధిస్తోంది. మంగళవారం తిరుమలగిరిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. ఆరుగాలం కష్టంచే రైతులను యూరియా కొరత వేధిస్తుండటంతో అన్ని పనులు వదిలి షాపుల ఎదుట పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు యూరియా కొరత లేదని చెబుతున్నా..అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పది సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులను చూడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బస్తా యూరియా ఇస్తే వ్యవసాయం ఎలా చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
హాలియా, సెప్టెంబర్ 2: సాగర్ నియోజకవర్గంలో 20రోజులుగా రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తిండీతిప్పలు మాని సహకార సంఘం గోడౌన్ల ఎదుట పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా దొరకడం లేదు. ఈ సందర్భంగా పలువురు మహిళా రైతులు సీఎం రేవంత్‌రెడ్డిపై, ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులకు బస్తా యూరియా కూడా ఇప్పించలేని పనికి మాలిన ఎమ్మెల్యే మాకు వద్దంటూ ఓ మహిళా రైతు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుముల మండలం రామడుగుకు చెందిన ఆడెపు సుశీల అనే మహిళా రైతు పది రోజులుగా ఇల్లూ వాలికి వదిలి యూరియా కోసం లైన్లో నిలబడినా బస్తా కూడా దొరకలేదన్నారు. నా లెక్క అనేక మంది రైతులు నిత్యం యూరియా కోసం ఇబ్బందు లు పడుతున్నారు. ఓట్ల కోసం మా దగ్గరికి అందరూ వచ్చిన్రు. కానీ ఇప్పుడు ఎవరూ రైతులు వద్దకు రావడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు, రైతులకు బస్తా యూరియా కూడా ఇప్పించలేనప్పుడు ఎమ్మెల్యే పదవికి అసలు పోటీనే చేయవద్దు. ఆ రోజు నేనే పెద్ద మొతేబరి లెక్క వచ్చి పోటీ చేసిండు. ఇప్పుడేమో యూరియా బస్తాలు ఇప్పించేందుకు ముఖం చాటేసిండు అంటూ స్థానిక ఎమ్మెల్యేపై ఫైర్ అయింది.
తుంగతుర్తి, సెప్టెంబర్ 2 : తుంగతుర్తిలోని రైతు సేవా సహకార సంఘ కేంద్రం వద్ద మంగళవారం రైతులు ఉదయం నాలుగు గంటల నుంచే పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ పనులు వదిలి రోజుల తరబడి యూరియా కోసం లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రతిరోజూ రెండు లారీలు వచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.