రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గులాబీ జెండానే పేదలకు అండ అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజాపేటలో బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనం సంబురంగా సాగింది. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు డప్పుల దరువుల మధ్య ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం సమ్మేళనంలో విప్ సునీత మాట్లాడుతూ తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
24 గంటల ఉచిత కరంట్, పుష్కలంగా సాగునీరు, రైతు బంధు వంటి పథకాలతో నాడు దండుగ అన్న వ్యవసాయం నేడు పండుగలా మారిందని తెలిపారు. బీఆర్ఎస్ దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్నదని, ఓర్వలేని బీజేపీ కుట్రలు, ఐటీ, ఈడీ దాడులకు తెరలేపుతున్నదని మండిపడ్డారు. విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ దేశానికి అవసరమని ఇతర రాష్ర్టాల ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
రాజాపేట, ఏప్రిల్ 17 : కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం.. ఆలేరు నియోజకవర్గ ప్రజలే తన బలగం.. వారి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆలేరు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. మండల కేంద్రంలోని మీనాక్షి ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ప్రజలు ఇచ్చిన అవకాశంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదింటికీ అందుతున్నాయని తెలిపారు. 2014కు ముందు ఉన్న కష్టాలు ఇప్పుడు రాష్టంలో ఎక్కడా లేవని.. సాగు, తాగునీటితోపాటు నిరంతర ఉచిత విద్యుత్‌తో ఇబ్బందులు తీరాయని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందడంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయని చెప్పారు. ఎనిమిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించి నేడు దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. బీడు భూములను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నాడు దండుగ అన్న వ్యవసాయం నేడు పండుగలా మారిందని, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న జనరంజక పాలనతో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని తెలిపారు. దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న బీఆర్ఎస్ పట్ల దేశ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటూ తెలంగాణ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలను సంపన్నులను చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుంటే.. కేంద్రం పేదలను దోచి పెద్దలకు పెడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి దేశం మొత్తం బ్రహ్మరథం పడుతున్నదని, దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. దేశానికి కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు ఎంతో అవసరమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గడపగడపకూ తీసుకుపోయి పార్టీ మరింత అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు వచ్చే పగటి వేషగాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
తెలంగాణ జాతి పిత సీఎం కేసీఆర్
ఎమ్మెల్సీ యాదవరెడ్డి
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతి పితగా నిలిచిపోయారని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. రాష్ట్ర సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది కరడుగట్టిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులు, కుంటలు మండుటెండల్లో కూడా జలకళను సంతరించుకున్నాయని, కరువు నేల పాడి పంటలతో కళకళలాడుతున్నదని తెలిపారు. దేశం అబ్బురపడేలా తెలంగాణను అభివృద్ధి చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. మళ్లీ రాష్ట్రంలో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు పార్టీ మరింత అభివృద్ధికి సైనికుల్లా పని చేయాలని సూచించారు.
తెలంగాణ ప్రజల దేవుడు సీఎం కేసీఆర్
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
మొక్కవోని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన విక్రమార్కుడు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు సాగాయని, బక్కపలుచని ప్రాణంతో తెలంగాణ రాష్ట్రం వస్తుందా? అని ఎంతో మంది నాయకులు హేళన చేసినా కేసీఆర్ పట్టించుకోకుండా రాష్ట్రం కోసం ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు అని పేర్కొన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో రాష్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన అభివృద్ధి ప్రధాత అని కొనియాడారు. రైతులను రాజును చేయాలనే గొప్ప సంకల్పంతో అపర భగీరథుడిలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు నీరు అందిస్తుండడంతో నేడు తెలంగాణ రాష్ట్రం మరో కోనసీమగా మారిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో మౌలిక వసతులు సమకూరాయని తెలిపారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు దేవుడిలా కొనియాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పక్క రాష్టాల్లో కూడా అమలు చేయాలని అక్కడి ప్రజలు పాలకులను నిలదీస్తున్నారని తెలిపారు.
రాజాపేట గులాబీమయం..
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంతో రాజాపేట మండల కేంద్రం గులాబీమయమైంది. ప్రధాన వీధుల్లో స్వాగత ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా అంబేద్కర్ చౌరస్తా నుంచి మీనాక్షి ఫంక్షన్ హాల్ వరకు డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, పటాకులు పేల్చుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద క్రేన్ సహాయంతో గొంగిడి దంపతులను బీఆర్ఎస్ నాయకులు గజమాలతో సత్కరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మోత్కుపల్లి ప్రవీణ్, అర్కాల గాల్‌రెడ్డి, చింతలపూరి వెంకట్రాంరెడ్డి, గొల్లపల్లి రాంరెడ్డి, కాకల్ల ఉపేందర్, గౌటె లక్ష్మణ్, ఎర్రగోగుల జశ్వంత్, సంతోష్‌గౌడ్, వీరేశం, మధుసూదన్‌రెడ్డి, తిరుమలేశ్, వెంకటేశ్‌గౌడ్, నర్సింహులు, జనార్దన్‌రెడ్డి, భాగ్మమ్మ, కవిత, బాలు, ఈశ్వరమ్మ, మహేందర్‌గౌడ్, నరేందర్, రాజు, సురేశ్, వేణుగౌడ్, రాజు, స్వామి పాల్గొన్నారు.