యాదగిరిగుట్ట, నవంబర్ 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ప్రధానాలయ ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు సుదర్శన హవనం జరుపగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవసేవను జరిపారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా సాగింది. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపి, భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. సాయంత్రం స్వామివారికి వెండి మొక్కుజోడు సేవ, దర్బార్ సేవ నిర్వహించారు. ఉదయం, రాత్రి రెండు దఫాలుగా స్వామివారికి తిరువారాధన చేపట్టి, స్వామి, అమ్మవారికి సహస్రనామార్చన జరిపారు. స్వామివారికి సువర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తిక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు దీపారాధన, సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. సుమారు 9వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.24,84,542 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. స్వామివారిని రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ బి.శివధర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ భాస్కర్‌రావు ఆయనకు ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సరం క్యాలెండర్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆలయం పశ్చిమ రాజగోపురం వద్ద భక్తులకు విక్రయిస్తున్నారు. ఒక్కో క్యాలెండర్ ధర రూ.25గా నిర్ణయించారు. నూతన క్యాలెండర్‌ను కొనుగోలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
స్వామివారి విమానగోపురం స్వర్ణతాపడం పనులకు 60 కిలోల బంగారం వినియోగిస్తుండగా.. పనులు చేస్తున్న స్మార్ట్ క్రియేషన్ సంస్థకు అక్టోబర్ 10న 12కిలోల బంగారం అందజేశారు. గురువారం ఆలయ ఈఓ భాస్కర్‌రావు చెన్నైకి వెళ్లి మరింత బంగారం అప్పగించారు. ఎంత బంగారం ఇచ్చారన్న అంశం తెలియాల్సి ఉంది. విమానగోపురం స్వర్ణతాపడం పనులకు కావాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. వెలుపలి ప్రాకార మండపంలోని మాఢవీధుల్లో పరంజా నిర్మించారు.