మేళ్లచెర్వు, జూలై 16: హాస్టల్ల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడు తున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు శివారులో బుధవారం జరిగింది. మండల కేంద్ర శివారులోని అద్దె భవనంలో ఐదేండ్లుగా గిరిజన సం క్షేమ గురుకుల పాఠశాల, కళాశాల నడుస్తోంది. వాస్తవానికి ఇది హుజూర్నగర్ మండలానికి మంజూరు కాగా అక్కడ వసతులు లేకపోవడంతో మేళ్లచెర్వు మండలం శ్రీనగర్ కాల నీ వద్ద నిర్వహిస్తున్నారు. రెండేండ్లుగా ఇక్కడ వసతి బాగానే ఉన్నా బోర్లు ఎండిపోయి నీటిఎద్దడి నెలకొంది.
ప్రస్తుతం ఇక్కడ 468 మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈఏడాది నీటి సమ స్య మరింత తీవ్రం కావడంతో బుధవారం విద్యార్థులు మేళ్లచెర్వు-కోదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. స్నానాలకు, వాష్‌రూంలకు నీళ్లు రావడం లేదని, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జాం కావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.