కట్టంగూర్, ఫిబ్రవరి 16 : పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళన విడనాడాలని తెలంగాణ మెమొరీ ప్రెసిడెంట్, సైకాలజిస్ట్ డాక్టర్ జి. చంద్రకళ అన్నారు. సోమవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల ప్రగతికి మార్గదర్శి-వ్యక్తిత్వ వికాస కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. సరైన ప్రణాళిక, సమయ పాలన, సానూకూల ఆలోచనలతో విజయం సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి లేకుండా ప్రోత్సాహకర వాతావరణం కల్పించాలని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి వారికి ఆత్మవిశ్వాసం కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడం, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణపై విద్యార్థులకు రెండు గంటల పాటు అవగాహన కల్పించారు. ఎంఈఓ అంబటి అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొంక ఆంథోని, మహమ్మద్ అబ్దుల్ గపూర్, చిన్ని శ్రీనివాస్, జయమ్మ, రాణి పాల్గొన్నారు.