పెన్‌పహాడ్, ఆగస్టు 04 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని, సాధించే దిశగా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం పెన్‌పహాడ్ జడ్పీహెచ్ఎస్, కేజీబీవీ, తాసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకక్ష్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తెలుగు మీడియం పదో తరగతి బయో సైన్స్ క్లాస్‌ని విద్యార్థులతో కలిసి విన్నారు. అలాగే ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి విద్యార్థులను ఇంగ్లిష్ సబ్జెక్టు పై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఉపాధ్యాయులతో సమావేశమై బోధనాభ్యసనాల తీరుపై సమీక్షించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి, విద్యా బోధన, భోజనం సౌకర్యం, ఇతర సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగదిలోని కూరగాయలు, ఆయిల్, పప్పును పరిశీలించారు. తాజా కూరగాయలతో పాటు నాణ్యమైన సరుకులను మాత్రమే వంటకి ఉపయోగించాలని నిర్వహాకులకు సూచించారు.
తదుపరి తాసీల్దార్ కార్యాలయంలో భూ భారతి అర్జీలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అధికారుల బృందాలు గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ లాలూ నాయక్ స్పందిస్తూ.. భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా 2,953 అర్జీలు వచ్చాయని, 925 అర్జీలకి నోటీసులు జారీ చేయటం జరిగిందని, 10 అర్జీలను పరిష్కరించటం జరిగిందని, మిగిలినవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంఈఓ రవికుమార్, ఆర్ ఐ రంజిత్ రెడ్డి, కేజీబీవీ ఎస్ఓ ఆసియా జబ్బీన్, పీఈటీ జానకమ్మ, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Penpahad : విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్