అనంతగిరి, ఏప్రిల్ 05 : విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జయభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు తమ కళాశాల వార్షిక నివేదికతో పాటు తమ వ్యక్తిగత అభ్యాసన నివేదికను కూడా పునః పరిశీలించుకోవాలన్నారు. డ్రగ్స్ , బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని, కళాశాల వనరులు వినియోగించుకుని లక్ష సాధనకు కృషి చేయాలన్నారు.
Anurag Engineering College : విద్యార్థులు సామాజిక చైతన్యం కలిగి ఉండాలి : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ప్రతి విద్యార్థి ప్రతిరోజు లైబ్రరీ, క్రీడా ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల కరస్పాండెంట్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు పుట్టిన గడ్డకు, చదివిన కళాశాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని తమ జీవిత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఈపాం సిస్టం అధినేత ఇమాన్యుల్ ఘోషల్ మాట్లాడుతూ.. ఇష్టంగా చదివి కష్టాలు అధిగమించాలన్నారు. ఉన్నత లక్ష్యాలు చేరుకున్న తర్వాత మరికొంత మందికి ఆసరాగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్ సురేశ్, చిన ఈశ్వరయ్య, కళాశాల సొసైటీ కోశాధికారి వేనేపల్లి వెంకటేశ్వరరావు, యాజమాన్య ప్రతినిధులు భూపాల్, భూపతి, ప్రసాద్, టీపీఓ విద్యాసాగర్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.