నిడమనూరు, నవంబర్ 21 : మెరుగైన విద్యా బోధనతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ధేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గల జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు డిజిటల్ స్క్రీన్ ద్వారా విద్య బోధన, వసతి సౌకర్యాల కల్పనను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు ఉపాధ్యాయులు బాధ్యాయుతంగా పని చేయాలని కోరారు. విద్యార్థులు డిజిటల్ బోధనను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామ పెద్ద కొండా శ్రీనివాస్ రెడ్డి సహకారంతో చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండా కృష్ణవేణి, మాజీ వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్ రెడ్డి, నాయకులు ముంగి శివ మారయ్య, సోమనబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.