కట్టంగూర్, నవంబర్ 18 : తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు డ్రగ్స్ నివారణ, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్పీ అదేశాల మేరకు పోలీస్ శాఖ అధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే అది జీవితాన్నే నాశనం చేస్తుందన్నారు. యువత డ్రగ్స్ కు బానిసలై మత్తులో తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు.
డ్రగ్స్ మహామ్మారిని తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. డ్రగ్స్ వల్ల వాటిల్లే దుష్పరిణామాలపై పోలీసు శాఖ అధ్వర్యంలో పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మునుగోటి రవీందర్, ఉపాధ్యాయులు అంథోని, మహాలక్ష్మి, జయమ్మ, లేజ, షాహెదా, చంద్రం, పోలీసు సిబ్బంది వెల్లెంల శంకర్, సతీశ్ పాల్గొన్నారు.