సూర్యాపేటటౌన్, జూన్ 24: ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాధికారి అశోక్‌తో కలిసి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ -2025 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం జులై 1 నుంచి పర్యావరణ క్విజ్ ప్రారంభమవుతుందన్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హార్ట్ ద వే ఆఫ్ లైప్ అనే థీమ్ దేశ వ్యాప్తంగా ఎన్ఎస్పీసీ పోటీని పర్యావరణ సంరక్షణ నిర్వహిస్తుందన్నారు. ఈ క్విజ్ పోటీకి జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. ఫలితాలు ఆగస్టు 30న ప్రకటిస్తారని, ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో పోటీ నిర్వహిస్తారన్నారు. ఎకోమిట్రమ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్విజ్ ప్రశ్నలు ఉంటాయన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదన్నారు. మొక్కలు నాటుతున్న, సేవ చేస్తున్న వీడియోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలు ఈసారి 5 విభాగాల్లో నిర్వహిస్తారన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి 8వ తరగతి వరకు, 8 నుంచి 12వ తరగతి వరకు, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, ఇతర పౌరులు కూడా పాల్గొనవచ్చన్నారు.
పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్ ఇస్తారని, విద్యాసంస్థలకు ప్రత్యేక గుర్తింపునిస్తుందన్నారు. వివరాలకు :https://ecomitram.app/ లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, సెక్టోరియల్ అధికారి శ్రావణ్, జనార్ధన్, రాంబాబు, అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.