రామగిరి (నల్లగొండ విద్యా విభాగం), మార్చి 1 : వారంతా ఉపాధ్యాయులే. డీఈడీ పూర్తి చేసి కొంత మంది ప్రభుత్వంలో, మరి కొందరు ప్రైవేట్ పాఠశాలల్లో సెకండ్ గ్రేడ్ టీచర్స్‌గా పనిచేస్తూ బీఈడీ చదవాలనే సంకల్పంతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఆఫర్ చేసే బీఈడీ కోర్సు ప్రవేశ పరీక్ష (2024లో) రాసి ర్యాంకులు సాధించారు. 2024 డిసెంబర్లో నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా 500 వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 అధ్యయన (బీఈడీ కళాశాలలు) కేంద్రాల్లో ప్రవేశం పొందారు. 2024-26 విద్యా సంవత్సరంలో వీరి కోర్సు పూర్తి కావాల్సి ఉంది. కానీ నేటికి ప్రథమ సంవత్సరం తరగతులు పూర్తి కాలేదు,పరీక్షల నిర్వహణ జరగలేదు. మరో వైపు ద్వితీయ సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో సకాలంలో కోర్సు పూర్తి చేస్తారా..లేదా..? అనే సంశయంతో అభ్యర్థులు ‘త్రిశంకు స్వర్గం’లో కొట్టుమిట్టాడుతూన్నారు.
పూర్తికాని తరగతులు, పరీక్షలు
అంబేద్కర్ వర్సిటీ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం 2024-25 బ్యాచ్‌లో బీఈడీలో చేరిన విద్యార్థులకు ఫిబ్రవరి 2025లో ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే వీరికి గత సంవత్సరం(2025)లో వర్క్ షాప్ -1 వేసవి సెలవుల్లో 9మే నుంచి 18వరకు (పదిరోజులు) తరగతులు నిర్వహించారు. వీరికి గత సంవత్సరం జూన్ 23 నుంచి జూలై 9 వరకు స్కూల్ బెస్డ్ యాక్టివిటీపై ఇంటర్న్‌షిప్ నిర్వహించాలి. మొదటి అసైన్మెంట్ను ఆగస్టు 30న ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. అదే విధంగా వర్క్‌షాప్ -2 దసరా సెలవుల్లో అక్టోబర్ 9 నుంచి 28 వరకు, వర్క్‌షాప్ -3 నవంబర్ 7 నుంచి 9 వరకు , వర్క్‌షాప్ -4 జనవరి 9,2026 నుంచి 12 వరకు నిర్వహించాలి.
జనవరి 12, 2026న ఆన్లైన్లో అసైన్మెంట్స్ -2 సమర్పించాల్సి ఉంది. 2024-25 ప్రథమ సంవత్సరం పరీక్షల ఫీజు నోటిఫికేషన్ జనవరి 20,2026న విడుదల చేసి, ఫిబ్రవరి 5వరకు గడువు వెల్లడించాల్సి ఉంది. ఫిబ్రవరి 14, 2026 నుంచి 19 వరకు పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే నేటి వరకు వీటిలో గత సంవత్సరపు వేసవి సెలవులు (మే-2025)లో మాత్రమే వర్క్‌షాప్ -1 పూర్తయింది. మిగిలిన తరగతులు (వర్క్‌షాప్), షెడ్యూల్లోని ఏ అంశాలు పూర్తి కాలేదు. దీంతో విద్యా సంవత్సరం నష్టపోవడంతోపాటు 2024-25, 2025-26లో పూర్తి కావాల్సిన బీఈడీ కోర్సు, వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఎప్పుడు పూర్తవుతుందో.., ఎప్పుడు పరీక్షల నిర్వహిస్తారో తెలియక అభ్యర్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.