నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 01 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ ఎంజీయూ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా విశ్వవిద్యాలయ భూములను లాక్కుంటుందని ఆరోపించారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ భూములు విద్యార్థుల భవిష్యత్ కోసం ఉద్దేశించినవి. విద్య, పరిశోధనల కోసం కేటాయించిన భూములను వ్యాపార ప్రయోజనాల కోసం కబళించే ప్రభుత్వ ప్రయత్నాలను తాము సహించబోమన్నారు.
అక్రమ భూ సేకరణను తక్షణమే ఆపాలని, యూనివర్సిటీ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు, పౌర సమాజం పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు. భవిష్యత్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. హెచ్సీయూ భూ రక్షణ కోసం వెనక్కి తగ్గం.. విద్యార్థుల హక్కులను కాపాడే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అఖిలపక్ష సంఘం నాయకులు, బీఆర్ఎస్వీ ఎంజీయూ నాయకులు జనంపల్లి జాన్ప్రేం, పాక రవి, మాచర్ల సుధీర్, వాడపల్లి నవీన్, ఎస్ఎఫ్ఐ ఎంజీయూ అధ్యక్షుడు రవి, ఎంఎస్ఎఫ్ ఎంజీయూ అధ్యక్షుడు తరుణ్, కోటి ముఖేక్ పాల్గొన్నారు.