రామగిరి, మార్చి 29 : భార్యకు జబ్బు చేసిందని భర్త కుటుంబ బాధ్యతల నుంచి జరిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కష్టకాలంలో తోడుగా ఉండాల్సిన ఇంటి పెద్ద దూరమైనా బిడ్డను ఆ తల్లి కష్టపడి చదివింది. తల్లి కష్టం చూస్తూ పెరిగిన కుమారుడు శ్రద్ధగా చదువుకుంటూ పదో తరగతికి చేరాడు. తీరా వార్షిక పరీక్షలు జరుగుతున్న సమయంలో తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో అతడు తల్లడిల్లాడు. అనాథగా మారినందుకు కుమిలిపోయాడు. కానీ, కుంగిపోకుండా పరీక్షకు హాజరయ్యాడు. నల్లగొండలోని పాతబస్తీలోని సాగల లక్ష్మీప్రసన్న కొన్నేండ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో ఆమె భర్త ఏడేండ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనారోగ్యం వెంటాడుతున్నా కుటుంబ బాధ్యతను ఆమే భుజాలకెత్తుకుని కుమారుడు శివసాయిచైతన్యను చదివిస్తున్నారు. పట్టణంలోని జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అతడికి ప్రస్తుతం పరీక్షలు నడుస్తున్నాయి. కాగా, శనివారం లక్ష్మీప్రసన్న కన్నుమూశారు. ఈ క్రమంలో తల్లి మరణాన్ని తట్టుకుని శివసాయిచైతన్య శనివారం సెయింట్ ఆల్ఫోన్స్ ఎగ్జామ్ సెంటర్లో సైన్స్ ఎగ్జామ్ రాశాడు. పరీక్ష రాసివచ్చిన అనంతరం తల్లి అంత్యక్రియలు చేశారు.