– ఎంజీయూ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్
రామగిరి, మే 22 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని వర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ విమర్శించారు. శుక్రవారం నార్కట్‌పల్లి పోలీసులు నవీన్‌ను అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి తాసీల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. నియామకాల్లో అక్రమాలకు పాల్పడకపోతే, తప్పులు చేయకపోతే విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, పోలీసు కేసులతో అణచివేయాలని ప్రయత్నించడం వీసీ, రిజిస్ట్రార్ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్‌ను నాశనం చేస్తూ, రోస్టర్ నిబంధనలు, పారదర్శకత లేకుండా నియామకాలు చేపడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న సమయంలో వాటిపై స్పష్టత ఇవ్వకుండా విద్యార్థి నాయకులను టార్గెట్ చేయడం దారుణం అని మండిపడ్డారు. యూనివర్సిటీలో అక్రమాలను బయటపెడుతున్న నాయకులపై ఒత్తిడి తెచ్చి ఉద్యమాన్ని ఆపేయాలని చూస్తే విద్యార్థి సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. వీసీ, రిజిస్ట్రార్ తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.