నీలగిరి, జూలై 15 : సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాతో పాటు భద్రత ఉంటుందని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. మేము సైతం, కమ్యూనిటి పోలీస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ డి.సైదాబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక భాగస్వామిగా పని చేస్తాయన్నారు. నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. అంతేగాకుండా దోషులను, నిందితులను గుర్తించేందుకు వీలుంటుందన్నారు.
నేర పరిశోధనలో కూడా పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను గ్రామస్తులకు వివరించారు. సీసీ కెమెరాలను గ్రామ మాజీ సర్పంచ్ నాగయ్య, గ్రామస్తులు ఆమంచి రాజలింగం, అజయ్ సహకారంతో గ్రామ పోలీస్ శంకర్ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసినందుకు డీఎస్పీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు ఎంఎం రాజు, శంకర్ రాజు, సిబ్బంది తిరుమలేశ్, జానకిరాములు, నర్సింహ్మస్వామి పాల్గొన్నారు.
Nalgonda : సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా : డీఎస్పీ శివరాంరెడ్డి