అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చి అన్నింటికీ మొండిచెయ్యి చూపుతున్న కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రెండ్రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర సోషల్ మీడియా గ్రూపులో ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పని తీరుపై ఓ సర్వే జరుగుతున్నది. ఒక్క రోజులో 109 మంది సర్వేలో పాల్గొనగా.. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు 93 ఓట్లతో 85.32 శాతం, ఎమ్మెల్యే సామేల్‌కు కేవలం 16 ఓట్లతో 14.68 శాతం మాత్రమే మద్దతు దక్కింది. అధికార పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యేపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
– సూర్యాపేట, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)
ఏడాది క్రితం అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమైనవని తేలిపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒకటీ రెండు స్కీమ్‌లను మాత్రమే అరకొరగా ప్రారంభించి చేతులు దులుపుకోవడంపై మండిపడుతున్నారు. అంతేగాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు బంద్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో వ్యతిరేకత మరీ ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహారశైలిని ప్రజలే గాక సొంత పార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరుపై నిర్వహించిన సర్వేలో కేసీఆర్‌కు భారీగా మద్దతు లభించగా, రేవంత్‌కు నామమాత్రపు స్పందన రావడం కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది. ఈ క్రమంలో నియోజకవర్గాల స్థాయిలో సోషల్ మీడియా వేదికగా సర్వేలు జరుగుతున్న సర్వేలోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఫలితాలే వస్తున్నాయి.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన అభివృద్ధి నిలిచిపోవడం, సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేకపోవడంతోపాటు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్పైనా సొంత పార్టీలో పెద్దఎత్తున వ్యతిరేకత కనిపిస్తున్నది. ప్రతి గుంట భూమికీ సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం కాగా, నేడు కాంగ్రెస్ పాలనలో సాగు నీటి కోసం రైతులు ఎదురుచూడాల్సి వస్తున్నది. కండ్ల ముందే పంటలు ఎండిపోతుండడంతో రైతులు తట్టుకోలేకపోతున్నారు. దాంతో రైతాంగం అధికార కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నది. కేసీఆర్ ఇచ్చినవన్నీ పెంచి ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పెంచకపోగా.. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్, ఆయన కుటుంబంపై సొంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తూ వ్యతిరేకంగా భారీ సభ పెట్టడం వంటివి వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న సర్వేలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు అనూహ్య రీతిలో మద్దతు లభిస్తుండడం విశేషం. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సర్వేలు జరుగుతుండగా.. పలుచోట్ల బీఆర్ఎస్కు 60 నుంచి 70 శాతం, అధికార కాంగ్రెస్‌కు 30 నుంచి 40 శాతం మద్దతు లభిస్తున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. తుంగతుర్తిలో మాత్రం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు 93 శాతం మద్దతు లభించగా, ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేల్‌కు 16శాతం మాత్రమే దక్కడం గమనార్హం.