నల్లగొండ ప్రతినిధి, జనవరి22(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల జాబితాల ఆమోదం కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు బుధవారం కూడా తీవ్ర గందరగోళం.. నిరసనలు, అడ్డగింతలు.. ఆగ్రహాల మధ్యనే కొనసాగాయి. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హుల ఎంపిక జాబితాలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా జాబితాలపై ప్రజలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ అధికారులను నిలదీశారు. అర్హులైన వారిని పక్కన పెట్టి అనర్హులకే పెద్దపీట వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరుతో ఏడాది కిందట దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక పెట్టుకున్న దరఖాస్తుల ప్రకారం తమకు పథకాలు అందుతాయని ఇన్నాళ్లు ఎదురుచూస్తూ వచ్చారు.
ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేస్తామంటూ అందుకు అర్హులైన లబ్ధిదారుల కోసం గ్రామ సభలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ గ్రామ సభల్లో ప్రదర్శిస్తున్న జాబితాల్లో వచ్చిన పేర్లకు గతంలో ప్రజాపాలన దరఖాస్తుల్లో చేసిన వారికి చాలా వరకు పొంతన లేకుండా ఉన్నాయి. దీంతో రెండు రోజుల నుంచి జరుగుతున్న గ్రామసభల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. అన్ని చోట్ల అధికారులపైకి ప్రజలు తిరగబడుతున్నారు. ఏవేమీ జాబితాలు? ఏ ప్రతిపాదికన ఎంపిక చేశారు? కొద్ది మందినే ఎంపిక చేయడంలో ఉద్దేశ్యం ఏంటని? ప్రజలు నిలదీస్తుండడంతో అధికారుల వద్ద సమాధానం కరువైంది. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాల్లో చాలా మంది అనర్హులకు చోటిచ్చి… అసలైన నిరుపేదలను పక్కన పెట్టారంటూ ఎక్కువ చోట్ల ఆందోళనలు కనిపించాయి. కొన్నిచోట్ల ఇదేమీ రాజ్యం… ఇదేమీ రాజ్యం… దోపిడీ రాజ్యం… దొంగల రాజ్యం అంటూ నినాదాలు హోరెత్తాయి. బుధవారం నల్లగొండ జిల్లాలోని గుడిపల్లి మండల కేంద్రంలో గ్రామసభలో రచ్చరచ్చ జరిగింది.
అధికారులు చూపిన జాబితాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిడమనూర్లోనూ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకే ఎక్కువగా ఇచ్చారంటూ అధికారులపై తిరుబడ్డారు. దీంతో ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు బయటకు వెళ్లిపోయారు. త్రిపురారం మండలం డొంకతండాలో రేషన్కార్డలు, ఇండ్ల జాబితాలో అర్హులే లేరంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ మండలం అప్పాజిపేట, ఖాజీరామారంలోనూ జాబితాలపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలైన పేదలను పక్కన పెట్టి అర్హత లేని వారికే ఇచ్చారంటూ అధికారులను నిలదీశారు. కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామసభలో ప్రజలు జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, ఇండ్లల్లో నిజమైన పేదల పేర్లు లేవని నిలదీశారు. చిట్యాల మండలం ఆరెగూడెంలో ప్రజలు జాబితాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో తప్పులతడకగా జాబితాలు రూపొందించారని, తక్షణమే వీటిని రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాలంటూ అధికారులతో వాదనకు దిగారు. శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో బీఆర్ఎస్ నేతలు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలపై అధికారులను నిలదీశారు. గట్టుప్పల్ మండలం తెరటుపల్లిలో రేషన్‌కార్డు, ఇండ్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామసభలోనూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇంకా దాదాపు ఎక్కువ గ్రామాల్లో గతంలో దరకాస్తులు చేసిన వారికి లబ్ధిదారుల జాబితాల్లో చోటుదక్కక పోవడంతో ప్రజలు శాపనార్ధాలు పెట్టడం కనిపించింది. ఇక జాబితాల్లో పేర్లు లేని వారంతా కొత్తగా దరఖాస్తులు పెట్టుకునేందుకు ఎగబడుతూ పలుచోట్ల కనిపించారు. అయితే కొన్నిచోట్ల అధికారులు కొత్త దరఖాస్తులకు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. తూతూమంత్రంగా తమ వెంట తెచ్చుకున్న జాబితాలను చదివి వినిపిస్తూ గ్రామసభలను మమా అనిపిస్తునట్లు కూడా తెలుస్తున్నది.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లా వ్యాప్తంగా 139 గ్రామ సభలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలోని 35 వార్డుల్లో బుధవారం సభలు జరిగాయి. గ్రామ సభలు ప్రారంభమైన తరువాత అయితే ఒకటి రెండు మినహా దాదాపు అన్ని చోట్ల అధికారులను ప్రజలు నిలదీశారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, భూములు ఉన్న వారు, ఇతర ఆస్తులు ఉన్న వారికి ఇస్తున్నారని, ఇంత చేసి ప్రజలకు ఏదో చేస్తున్నట్లు ఏ ముఖం పెట్టుకొని గ్రామ సభలకు వస్తున్నారంటూ అధికారులను నిలదీశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 15, 22, 23వ వార్డుల్లో సభలో గందరగోళం జరిగింది. నేరేడుచర్ల, దిర్శించర్ల, రేపాల, దోరకుంట, శూన్యంపహాడ్, వేపలసింగారం, నక్కగూడెం, చింతలపాలెం, మంగళతండా, అమీనాబాద్, రేపాల, దిర్శించర్ల, శెట్టిగూడెం, సూర్యాపేట మండలం రత్నపురం, పెన్‌పహాడ్ మండలం మాచారం, అర్వపల్లి బొల్లంపల్లి, నాగారం మండలం ఫణిగిరి, హుజూర్నగర్ మండలం లింగగిరి, తుంగతుర్తి మండలం సూర్యతండా, గొట్టిపర్తిలతోపాటు చింతలపాలెం నక్కగూడెం తదితర అనేక గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవని సభలకు హాజరైన అధికారులను ప్రశ్నించారు.