అర్వపల్లి, మే 28 : నకిలీ విత్తనాలు అమ్మితే విత్తన డీలర్లు, దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్, ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించాలని, రైతులకు వానాకాలం సీజన్‌కి సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అలాగే రైతులు ఏ ఏ పత్తి విత్తనాలపై ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాన్ని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ వేణు మాధవరావు, ఎంపీడీఓ గోపి, ఏఓ గణేశ్ పాల్గొన్నారు.