నీలగిరి, ఆగస్టు 25 : చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలు రకాల నేరాలు చేసి, రౌడీషీట్లు నమోదైన 20 మందికి అలాగే పాత నేరస్తులకు రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రౌడీ షీటర్ల కదలికలపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కేసులు నమోదు చేసి, పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు.
గత నేర ప్రవృత్తిని వదిలేసి, సమాజ హితంగా బతకాలని సూచించారు. పట్టణంలో సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగేలా, సామాన్య ప్రజలను బెదిరించినట్లుగా ఎటువంటి సమాచారం తెలిసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరిని బైండోవర్ చేయడం జరుగతుందని, దాన్ని ఉల్లంగించిన వారికి రూ.2 లక్షల జరిమానతో పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సతీశ్, సైదులు, సిబ్బంది షకీల్, రబ్బాని, సైదులు, శ్రీకాంత్ వెంకన్న పాల్గొన్నారు.