– నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి
నీలగిరి, మార్చి 26: నల్లగొండ పట్టణంలో శాంతిని భగ్నం చేయాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ప్రజల్లో భద్రతా భావాన్ని బలపరచేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్సీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి పట్టణంలో విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించబడిన మాన్యంచెల్క, మాన్యంబావి, హైదర్ఖాన్ గూడ ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ ప్రధానంగా కొనసాగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా అసాంఘిక శక్తులు, గొడవలకు ఆస్కారం కలిగించే వ్యక్తులకు గట్టి హెచ్చరిక ఇవ్వడమే కాకుంగా, ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకునేలా భద్రతా వాతావరణాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యంమని సీఐ వెల్లడించారు. రాబోయే రోజుల్లో పండుగలు, ప్రత్యేక కార్య క్రమాలు లేదా ఇతర సందర్భాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా వారు ఎవరితో తిరుగుతున్నారు, రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి చర్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరించారు. అలాగే ప్రజలు సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే పుకార్లను నమ్మకుండా, ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది, ఇతర సాయుధ దళాలు పాల్గొని పట్టణ ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు.

‘శాంతికి భగ్నం కలిగించేవారిపై కఠిన చర్యలు’