కోదాడ, జూన్ 08 : కోదాడ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కోదాడ పట్టణ ఎస్ఐ మల్సూర్ హెచ్చరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 26వ వార్డులో జరిగిన వార్డు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వార్డుల్లో రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తులు సంచరించినా, ఆకతాయిలు అల్లర్లు సృష్టించినా పౌరులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, కాలనీల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా వార్డు ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.
కౌన్సిలర్ నేహా నాజ్ మాట్లాడుతూ వార్డు పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికే ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. వర్షాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధులు పట్ల ప్రతి జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ షమ్మీ, బాగ్దాద్, మజాహార్ బాబా షర్ఫుద్దీన్, ఆర్ పి జాన్ బేగం, మహిళా సంఘాల సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.