తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించారు. అన్ని రకాల వైద్య పరికరాలను సమకూర్చడంతో డయాగ్నోస్టిక్స్తోపాటు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దాంతో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి.
నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నవారే ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దాంతో ఓపీ సేవలు పదింతలు పెరిగాయి. 2014కు ముందు సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఒక నెలలో 8వేలకు మించి ఓపీ సేవలు ఉండకపోగా నేడు 85 వేలకుపైగా నమోదవుతున్నాయి. నాడు పది మంది కూడా అడ్మిట్ అయ్యి చికిత్స పొందకపోగా నేడు వేల మంది అడ్మిట్ అయ్యి సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు. ఇక విస్తృతంగా పల్లె, బస్తీ దవాఖానలతోపాటు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల అందుబాటులోకి రావడంతో ఆధునిక వైద్యం ప్రజలకు చేరువైంది.
సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : నాలుగైదు దశాబ్దాల క్రితం ఓ సినిమాలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అంటూ రాసిన పాట నాటి ప్రభుత్వాలు అందిస్తున్న వైద్యానికి పరాకాష్ట. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం అంటే చావును కొని తెచ్చుకోవడమే అనే నానుడి ఉండేది. కానీ, స్వరాష్ట్రంలో అనూహ్యంగా ప్రభుత్వ వైద్య సేవలు ప్రజల ముంగిటకు రావడంతో జిల్లాలో ఓపీ సేవలు పదింతలు పెరిగాయి. 2014కు ముందు సూర్యాపేట జిల్లాలోని అన్ని ఆస్పత్రులు కలిపి నెలలో 8వేలకు మించి ఓపీ(ఔట్ పేషంట్) ఉండకపోగా, నేడు ఏకంగా 85వేలకు పైనే ఓపీ నమోదవుతున్నాయి.
దీనికి కారణం ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం అందించే వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగడమే. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చొరవతో జిల్లాకు మెడికల్ కళాశాల రాగా, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో భాగంగా ఆస్పత్రుల ఆప్‌గ్రేడేషన్, పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటు, మహిళలకు ప్రత్యేక చికిత్సలతోపాటు అన్ని దవాఖానాల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చి అన్ని రోగాలకు చికిత్సలు అందిస్తున్నారు. దాంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగి చిన్న, పెద్ద రోగాలకు ప్రభుత్వ వైద్యశాలల్లోనే చికిత్స చేయించుకుంటున్నారు. నాడు చిన్న రోగం వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయగా, నేడు ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సలు అందుతుండడంతో ప్రజలు వైద్యంపై చేసే ఖర్చు భారీగా తగ్గింది.
గత ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్ షేషంట్లు, ఇన్ పేషంట్ల సంఖ్యలో ఊహించని రీతిలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2014కు ముందు జిల్లాలో నెలకు 8 వేలకు మించి ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్ పేషంట్ చికిత్సలు పొందకపోగా, నేడు ఏకంగా 85 వేల మందికి పైనే చికిత్సలు పొందుతున్నారు. అలాగే నాడు ఇన్ పేషంట్లుగా చేరాలంటే అసలు జిల్లా వ్యాప్తంగా కలిపి మొత్తం 250 బెడ్స్ కూడా లేకపోగా, నేడు దాదాపు 3 వేలకు పైగానే అందుబాటులో ఉన్నాయి. నాడు ఇన్‌పేషంట్లుగా చికిత్సలు పొందిన వారి సంఖ్య 30 నుంచి 50 మంది లేకపోగా, నేడు ఏకంగా సగటున 2,100 మందికి పెరిగారు.
ప్రధానంగా జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అనంతరం 2018-19లో ఔట్ పేషంట్ల సంఖ్య 3,54,621 ఉండగా, 2019-20లో 3,62,914 మంది, 2020-21లో 2,29,712, 2021-22లో 3,63,480మంది ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 3,17,704 మంది సేవలు పొందారు. అలాగే ఇన్ పేషంట్లు ప్రతి ఏటా 12 వేలకు పైగానే చికిత్సలు పొందుతున్నారు. మొత్తంగా గతంలో చిన్నపాటి రోగం వస్తే ప్రజలు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్సలు పొందితే తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగి ఆత్మహత్యలకు దారి తీసిన ఘటనలు ఉన్నాయి. నేడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యానికి ప్రాధాన్యం పెంచి మెడికల్ కళాశాలలు, ఇతరత్రా ఆస్పత్రులు ఏర్పాటు చేసి అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుండడంతో ప్రజలంతా ప్రభుత్వ వైద్యం పొందుతున్నారు.
సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డిని గెలిపిస్తే మెడికల్ కళాశాల ఇస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటైంది. దాంతో ఏరియా ఆస్పత్రి కాస్తా జనరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ కావడంతోపాటు వైద్యులు, వైద్య పరికరాలు, అన్ని రకాల రోగాలకు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. రోగ నిర్ధారణకు కావాల్సిన పరీక్షలన్నీ పల్లె దవాఖాన నుంచి జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ వరకు ఎంతో విలువైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. 2014కు ముందు జిల్లాలో 32 వివిధ రకాల ఆస్పత్రులు ఉండగా, నేడు 164 దవాఖానలు రాగా వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాలను సమకూర్చడంతో పల్లెల్లోనూ అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయి. డయాలసిస్‌తోపాటు టీ హబ్ ద్వారా మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల సమన్వయంతో 134 రకాల పరీక్షలు ఉచితంగా అందుతున్నాయి. అంతేకాకుండా 2డీ ఇకో, మమ్మోగ్రఫీ, అల్ట్రాసోనిగ్రఫీ, రేడియోగ్రఫీ లాంటి సేవలు అందిస్తున్నారు. ఇక సీజనల్ రోగాలు, సాధారణ జ్వరాలతోపాటు ఇతరత్రా రోగాలు వస్తే గ్రామస్థాయిలో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలతోపాటు పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జనరల్ ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు.
గతంలో గవర్నమెంట్ ఆస్పత్రి అంటే ఆమడదూరంలో ఉండేటోళ్లం. వైద్యం లేకున్నా పర్వాలేదనుకునేవాళ్లం. మందుబిళ్లలతో నయం చేసుకున్నాం. ఒక వేళ తప్పదు అనుకున్నప్పుడు అప్పు చేసైనా సరే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లెటోళ్లం తప్ప ప్రభుత్వ ఆస్పత్రి అంటే భయపడేటోళ్లం. అటువంటిది సీఎం కేసీఆర్ వచ్చిన కానుంచి సర్కారు దవాఖానలు అంటే నమ్మకం పెరిగింది. అంతేకాకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా చేస్తూ అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. అవసరమైన చికిత్సలు చేస్తూ ప్రాణాలు కాపాడు తున్నరు. ప్రతి దానికి పెద్ద ఆస్పత్రికి పోకుండా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా అవసరమైన వైద్య సేవలు, మందులు అందిస్తుండటంతో మాలాంటి ఎంతో మందికి ఆరోగ్యపరంగా సాయమందుతుంది. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచిన సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
-పోలెబోయిన కోటమ్మ, సూర్యాపేట
సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేయడంతో మెడికల్ కళాశాల ఏర్పాటై జనరల్ ఆస్పత్రితోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడ్డాయి. అంతేకాకుండా మారుమూల ప్రజలకు సైతం వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సూర్యాపేటలో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. 2014 కు ముందు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పదం పోయి 2014 నుంచి ఎంతటి ఆరోగ్య సమస్య అయినా ‘పోదాం పదా బిడ్డో సర్కారు దవఖానకు’ అనే స్థాయికి ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగుపడ్డాయి. ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల రూపంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు.
-పిన్నెళ్లి వెంకటేశ్, సూర్యాపేట
రెండు రోజుల క్రితం నాకు ఫిట్స్ రావడంతో నా భర్తకు ఎక్కడికి వెళ్లాలో తెలియక తెలిసిన వారు చెబితే సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఇక్కడ నా రోగానికి తగిన వైద్యం అందింది. నేను ఇక్కడ ఉన్న రెండు రోజులు డాక్టర్లు, సిబ్బంది ఎంతో అప్యాయంగా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇంజక్షన్లు, మందులు ఇచ్చారు. మందులు వేసుకున్నావా? అని అడుగుతూ నా రోగాన్ని నయం చేశారు. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగివెళ్తున్నా. నిజంగా సూర్యాపేట ఆస్పత్రి పెద్దాసుపత్రి అయ్యిందంటే ఏమో అనుకున్నా, కానీ ఇంత మంచి వైద్యం అందుతుందని అనుకోలేదు. పెద్ద పెద్ద డాక్టర్లు, ఎంతో మంది నర్సులు ఉన్నారు. వాళ్లను చూస్తేనే రోగం నయమవుతుందనే నమ్మకం కలుగుతుంది.
-రేణిగుంట నాగమణి, వెంపటి
నాకు పొట ్ట కింది భాగంలో కొంచం వాపు వచ్చింది. మా మునగాలలో కూడా ఆస్పత్రులు ఉన్నాయి. కానీ, సూర్యాపేట ఆస్పత్రిలో పెద్ద డాక్టర్లు అధునాతన మిషన్లతో వైద్య సేవలు అందిస్తున్నారంటే ఇక్కడికి వచ్చాను. వైద్యులు చాలా చక్కగా పరీక్షించారు. రక్త పరీక్షలకు రాశారు. వాటి రిపోర్టులు రాగానే వైద్యం మొదలు పెడుతామన్నారు. గతంలో ఈ ఆస్పత్రికి వస్తే వైద్యానికి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఓపీ రాసి ఇచ్చిన క్షణాల్లోనే వైద్య డాక్టర్లు పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించి మందులు ఇస్తున్నారు. గతంలో రోగులు లేనప్పటికీ వైద్యం చేయడం ఆలస్యమయ్యేది. నేడు ఆస్పత్రి నిండా రోగులు ఉన్నా వైద్యం ఆలస్యం కావడం లేదు.
-గునగంటి గురుస్వామి, మునగాల