కొండమల్లేపల్లి, నవంబర్ 15 : గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బతిన్న పనులన్నింటినీ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పాత చెరువు) ను పరిశీలించారు. ఒకటవ వీయర్ నుండి 5వ వీయర్ వరకు కాలి నడకన పర్యటిస్తూ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద వర్షాలకు తెగిపోయిన కాలువలు, దెబ్బతిన్న రహదారి, కట్ట పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి పేర్వాల రిజర్వాయర్ నిండి పొంగి ప్రవహించి ప్రమాద స్థాయికి చేరుకోగా దానికి అనుకుని ఉన్న హీర్యా తండా, సింగ్యా తండా ప్రజలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద దెబ్బతిన్న పనుల పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం ఎఫ్ డి ఆర్ కింద ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే భారీ వర్షానికి తెగిపోయిన, దెబ్బతిన్న కాలువలు, కట్టతో పాటు, కట్టమీద నుండి హీర్యా తండా, సింగ్యా తండా, అలాగే మరో రెండు తండాలైన గుడి తండా, కారోబార్ తాండాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్థిరీకరణ, సామర్థ్యం, ఎత్తు పెంచితే మునకకు గురయ్యే విస్తీర్ణం, గ్రామాలు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల రిజర్వాయర్ కింద దెబ్బతిన్న కాలువలు, కట్ట,రహదారి పనులన్నింటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Konda Mallepally : పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పునరుద్ధరణకు చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
రాష్ట్ర ప్రభుత్వం పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తు పెంచి నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకుగాను రూ.1,204 కోట్లుతో పరిపాలన అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2,771 ఎకరాలు భూసేకరణ అవసరం కాగా, ఇప్పటివరకు 1,917 ఎకరాలు పూర్తి చేయడం జరిగింది. 854 ఎకరాలకు అవార్డు పాస్ అయినప్పటికీ చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ పూర్తయితే గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది.
పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పాత) నీటి నిల్వ సామర్థ్యం 251.5 ఎఫ్ఆర్ఎల్గా ఉంది. ప్రస్తుతం గుడి తండా, కారోబార్ తండా, హిర్యా తండా, సింగ్యా తండా పూర్తి రిజర్వాయర్ సామర్థ్యానికి బయట ఉన్నాయి. అయితే కట్ట సామర్థ్యాన్ని పెంచి నీటి నిలువ సామర్థ్యం పెంచితే ఇవన్నీ మునకకు గురయ్యే అవకాశం ఉందని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం పెండ్లిపాకల రిజర్వాయర్ సామర్త్టం 0.54 టీఎంసీల మేర ఉండగా దీనిని 2.2 టీఎంసీలకు పెంచినట్లయితే ఈ నాలుగు తండాలు మునకకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ భద్రు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నెహ్రూ నాయక్, డీఈ రాములు, ఏఈఈ భాస్కర్ రావు, శ్రవణ్, సతీశ్ పాల్గొన్నారు.

Konda Mallepally : పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పునరుద్ధరణకు చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి