కోదాడ, డిసెంబర్ 05 : అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ధాన్యం అక్రమ రవాణా, శాంతి భద్రతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై విలేకరులతో ఆయన మాట్లాడారు. కోదాడ డివిజన్ పరిధిలో ఇతర రాష్ట్రాల నుండి అనుమతులు లేకుండా ధాన్యాన్ని రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. అక్రమ రవాణా అరికట్టేందుకు డివిజన్ పరిధిలో 6 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు తమ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనుమతులు లేకుండా, సరైన పత్రాలు లేకుండా ధాన్యం రవాణా చేసే వాహనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏడు లారీలు, ఒక ట్రాక్టర్ ను సీజ్ చేసినట్టు చెప్పారు. పౌర సరఫరాల శాఖ సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కోదాడ నియోజకవర్గంలో 120 గ్రామ పంచాయతీలను పరిశీలించగా అందులో 77 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరింపజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు వినూత్న చర్యలు చేపట్టడంలో భాగంగా పోలీస్ కళాజాతాలు గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు మరింత బలపడతాయని, చట్టాన్ని అందరూ గౌరవించాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.