కొండమల్లేపల్లి, నవంబర్ 15: గతనెల కురిసిన భారీ వర్షాల కారణం గా పెండ్లి పాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బ తిన్న పనులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. శనివారం ఇంజినీరింగ్, రెవె న్యూ అధికారులతో కలిసి మండలంలోని పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తెగిన కాల్వలు, దెబ్బతిన్న రహదారి, వర్షాలకు దెబ్బతిన్న కట్ట పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి పేర్వాల రాజర్వాయర్ నిండి పొంగి ప్రవహించి, ప్రమాద స్థాయికి చేరుకోవడంతో పెండ్లిపాకల రిజర్వాయర్ కట్ట తెగే ఆస్కారం ఉందన్నారు. రిజర్వాయర్‌కు ఆనుకొని ఉన్న హీర్యా తండా, సింగ్యా తండా ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా ఫకీర్ పురంలోని ప్రభుత్వ పాఠశాలలో, హీర్యా తండా వాసులను పెండ్లిపాకలలోని రైతు వేదికలో పునరావాసం కల్పించిన విషయం విదితమే. దెబ్బతిన్న కాల్వలు, కట్టతోపాటు కట్టమీద నుంచి హీర్యా తం డా, సింగ్యా తండా, కారోబార్ తండా, గుడి తండాల్లో, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్థీరీకరణ, సామర్థ్యం, ఎత్తు పెంచితే ముంపునకు గుర య్యే విస్తీర్ణాన్ని కలెక్టర్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు.
పెండ్లిపాకల రిజర్వాయర్ ప్రస్తుతం 0.54 టీఎంసీలు ఉండగా దీనిని 2.2 టీఎంసీలకు పెంచితే గుడితండా, కారోబార్ తండా, సింగ్యా తండా, హీర్యా తండాతో పాటు చింతచెట్టు తండాలో కొంత భాగం, కట్ట సామర్థ్యం పెంచి నీటి నిల్వ సామర్థ్యం పెంచితే పై తండాలన్నీ ముం పునకు గురవుతాయన్నారు. త్వరలో ముంపునకు గురయ్యే తండాలకు నష్టపరిహారం చెల్లించి, పెండ్లిపాకల రిజర్వాయర్ పనులు పునఃప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తు పెంచి నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు రూ. 1.204 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిందన్నారు.
ఇందులో 2,771 ఎకరాల భూ సేకరణ అవసరం కాగా, ఇప్పటి వరకు 1.917 ఎకరాలు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగతా 854 ఎకరాలకు అవార్డు పాసైనప్పటికీ చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. పెండ్లి పాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 251.5 ఎఫ్ఆర్ఎల్‌గా ఉందని అన్నారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్,డీఆర్డీవో వెంకటేశ్వర్లు, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ భద్రు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నెహ్రూ నాయక్, డీఈ రాములు, ఏఈఈ భాస్కర్‌రావు, తాసీల్దార్ నరేందర్, ఎండీడీవో స్వర్ణలత, ఎంపీవో మధు,శ్రవణ్, సతీష్ ఉన్నారు.