రాజాపేట, అక్టోబర్ 04 : విజయ డైయిరీపై కన్నతల్లి ప్రేమ చూపిస్తూ మదర్ డైయిరీపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ డైరెక్టర్ సందిల భాస్కర్ గౌడ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మదర్ డైయిరీ పాలకుల అసమర్ధత, చేతగాని తనంతో డైయిరీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మూడు దశాబ్దాలుగా యాదాద్రి పుణ్యక్షేత్రానికి నెయ్యి సరఫరా చేస్తున్నప్పటికీ, డైయిరీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు నెయ్యి సరఫరా నిలిపి వేశారని ఆరోపించారు. డైయిరీనే నమ్ముకుని ఉన్న 30 వేల మంది పాడి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించక వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
పాడి రైతుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయొద్దని అన్నారు. మదర్ డైయిరీపై విశ్వాసం కోల్పోయి పాడి రైతులు ప్రైవేట్ డైయిరీలను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజా ప్రతినిధులు మదర్ డైయిరీ అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోకపోవడం శోచనీయమన్నారు. పాలకులు స్వలాభాలు మానుకుని మదర్ డైయిరీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి కృషి చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహమ్మద్ బాబు, పోసుకొండ మధు, పోచకొండ దశరథ, గుర్రాల రాజు, గుంటి శ్రీశైలం పాల్గొన్నారు.