చివ్వెంల, అక్టోబర్ 6 : ఉండ్రుగొండను రాష్ట్రంలో నంబర్ వన్ టూరిజం స్పాట్‌గా మారుస్తామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కొండపై చారిత్రక కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండ్రుగొండ గిరిదుర్గం అత్యంత ప్రాచుర్యం కలిగిందని, ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకుల తాకిడి పెరుగుతుందని తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.2.5 కోట్లు నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.
ఉండ్రుగొండ సందర్శనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదుర్తి రామయ్య, చైర్మన్ చకిలం కృష్ణకుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, కమిటీ సభ్యులు బందకవి కృష్ణమోహన్, మురళీకృష్ణ, మధుసూదన్‌రావు, శ్రీరాములు, శ్రీనివాస్, శంకర్, హర్ష పాల్గొన్నారు.