ఆలేరురూరల్,జూన్22 : కొలనుపాకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండలంలోని కొలనుపాక సోమేశ్వరాలయం, వీరనారాయణ ఆలయాలను మంత్రి స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… సోమేశ్వరాలయాన్ని ఒక స్మార్ట్ టెంపుల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడ 18 మఠాలు ఉన్నాయని తెలుసుకున్నాం.
మఠాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం పరంగా సహకారం అందిస్తామన్నారు. త్వరలో సోమేశ్వరాలయం అభివృద్ధి కో సం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. సో మేశ్వరాలయం అభివృద్ధికి రూ.5కొట్లు మంజూరు చేస్తామని, టెంపుల్‌కు సంబంధించిన డిజైన్స్ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం పలు కుల సంఘాలకు చెందిన మ ఠాలను అభివృద్ధి చేయాలని, కుల సంఘాల నా యకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, సర్పంచ్ బెదరబొయిన యాకమ్మ, ఆర్కియాలజీ శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు, ఉప సర్పంచ్ గొట్టం విజేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మోత్కూరి ఐలయ్య, గంగుల శ్రీనివాస్, ఆరుట్ల లక్ష్మి, వీరనారాయణస్వామి ఆలయ చైర్మన్ దొంతిరి సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.
బౌద్ధ కట్టడాల పునరుద్ధరణకు శంకుస్థాపన
నాగారం, జూన్ 22 : ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగారం మండలం ఫణిగిరి, గాజులబండ బౌద్ద క్షేత్రాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు మంత్రి స్థానిక ఎమ్మెల్యే సామేల్‌తో కలిసి సోమవార శంకుస్థాపన చేశారు. ఫణిగిరి ప్రముఖ బౌద్ధ వారసత్వ కేంద్రాల్లో ఒకటని మంత్రి పేర్కొన్నారు. బౌద్ధక్షేత్రాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, వ్యవసాయ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్, డిప్యూటీ డైరెక్టర్లు నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.