కోదాడ, మార్చి 15 : రాష్ట్రస్థాయి ప్రభుత్వ పెన్షనర్ల సాంస్కృతిక ఉత్సవాలు, క్రీడా పోటీలు ఈ నెల 16న కోదాడలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల18వ తేదీ వరకు వరకు పోటీలు కొనసాగనున్నాయి. రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య నేతృత్వంలోని కమిటీ పోటీల నిర్వహణకు కృషి చేస్తుంది. శనివారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రావెళ్ల సీతారామయ్య వివరాలు వెల్లడించారు. కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు అన్నారు.
ప్రభుత్వ పెన్షనర్ల మధ్య సంఘీభావం, స్నేహం పెంపొందించాలనే లక్ష్యంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ పబ్లిక్ క్లబ్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పోటీలను ఆదివారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో విశ్రాంత ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. టెన్నికాయిట్, బ్యాట్మెంటన్, క్యారమ్స్, చెస్ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే సాంస్కృతిక పోటీల్లో భాగంగా పద్యాలు, పాటలు, ఏకపాత్రలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీతారామయ్య కోరారు. ఈ సమావేశంలో సంఘ బాధ్యులు ఎన్.సుదర్శన్ రెడ్డి, అక్కిరాజు వెంకట్రావు సోమయ్య, అమృతా రెడ్డి, వేనెపల్లి శ్రీనివాస్, బొల్లు రాంబాబు, రఘు ప్రసాద్, పూర్ణచంద్రారెడ్డి, ఎమ్మెస్ ఎన్. రాజు, కోటమర్తి విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.