రామగిరి, ఏప్రిల్ 07 : టీటీజేఏసీ, యూఎస్పీసీ, జేఏసీటీఓ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో గల లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరం 2025 మార్చిలో నిర్వహించిన ఎస్.ఎస్.సీ స్పాట్ మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పారితోషికం ఇంతవరకు ఇవ్వకపోవడం, అలాగే తెలంగాణ ప్రభుత్వం 2024 అక్టోబర్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించాలని పలుమార్లు ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. 10వ తరగతి మూల్యాంకన విధులకు చెల్లించే పారితోషికం గత 7 సంవత్సరాలుగా పెంచలేదన్నారు.
ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ ఇప్పటికే రెండుసార్లు పెంచినప్పటికీ ఎస్ఎస్సీ స్పాట్ రేట్లు ఏడు సంవత్సరాల నుండి అదే రెమ్యూనరేషన్ కొనసాగిస్తున్నారన్నారు. కావున SSC స్పాట్ రేట్లు కనీసం 50 శాతం పెంచాలని, ఈ సంవత్సరం స్పాట్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మూల్యాంకనం పూర్తి కాగానే మూల్యాంకన చివరి రోజునే పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో SSC స్పాట్ మూల్యాంకన కేంద్రం లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల వద్ద TTJAC, USPC, JACTO ఉపాధ్యాయ జె.ఎ.సి. సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన అనంతరం స్పాట్ క్యాంపు అధికారికి వినతిపత్రం అందజేశారు.
పదవ తరగతి మూల్యాంకన మరియు కుల గణన పారితోషికం చెల్లించుటకు తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తదుపరి భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ కాలం నారాయణరెడ్డి, మేకల జాన్ రెడ్డి, సత్తయ్య, టీఎస్ యూటీఎఫ్ పెరుమాళ్ల వెంకటేశం, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్ రెడ్డి, అరుణ, గేర నరసింహ, నలపరాజు వెంకన్న పద్మ, మమత, శ్యాం, రవీందర్, టీడీఎఫ్ నుండి వెంకటేశ్వర్లు, వెంకులు ఏడుకొండలు, ఎస్ టి యు టి ఎస్ భాను ప్రకాష్, టీఆర్టిఎఫ్ జనార్ధన్, ఎండీ. యూసీఫొద్దీన్, టీటీజేఏసీ, యూఎస్పీసీ, జేఏసీటీఓ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

‘గతేడాది ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలి’