నందికొండ, జూలై 28 : కృష్ణానది పరువళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వస్తుండంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4,41,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 873.40 అడుగులకు చేరింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇంకా 59 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నా ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీ స్థాయిలో ఉన్నందున త్వరలో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది.
ఇదే స్థాయిలో ఇన్‌ఫ్లో కొనసాగితే నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు మంగళవారంలోపు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు నాగార్జునసాగర్ ఎన్నెస్పీ అధికారులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గానూ ప్రస్తుతం 510.10 (131.83 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 5,3677 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో ఆయకట్టు కింద సాగు చేసే రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.