నల్లగొండ ప్రతినిధి, జూలై 29 (నమస్తే తెలంగాణ)/నందికొండ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ వడివడిగా పరుగులు తీస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టును భారీ వరద ముంచెత్తుతుండడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 3 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ద్వారా వస్తున్న నీటితో కలిపి మొత్తం 1.62లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుకుంటున్నది.
నాగార్జునసాగర్ జలాశయంలో వారం రోజుల్లో 9 అడుగుల నీటి మట్టం పెరిగి సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 512.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం గేట్ల నుంచి విడుదలైన వరద నీరు కూడా మంగళవారం ఉదయానికి సాగర్‌ను తాకవచ్చని అంచనా. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరద ప్రవహిస్తున్నది. ఇలాగే వారం రోజులు కొనసాగితే నాగార్జునసాగర్ జలాశయం నిండుతుంది. ప్రస్తుత పరిస్థితులతో సాగర్ ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన భూభాగానికి సాగు నీరందించే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో అనుకున్న దానికంటే ముందే భారీ వరదలు కృష్ణానదిలో పోటెత్తుతుండడంతో ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నిండడంతో కృష్ణమ్మ జూరాల క్రస్ట్ గేట్ల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రవహిస్తున్నది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4,52,583 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 879.20 అడుగులకు చేరుకుంది. దాంతో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు మూడింటిని 10 అడుగుల మేర ఎత్తి 81వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే నీటితో కలిపి మొత్తం 1,62,466 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతున్నది. మూడు రోజులుగా వరద ఉధృతి కొనసాగుతుండడంతో శ్రీశైలంలో వేగంగా నీటిమట్టం పెరుగుతూ వచ్చింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు 24 గంటల్లోనే 28 టీఎంసీల నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 215.80 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్ధ్యానికి గానూ 184.28 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి వరద నాలుగున్నర లక్షల క్యూసెక్కుల వరకు ఉండడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో ఆరడుగులు ఉండగానే క్రస్ట్ గేట్లను ఎత్తారు. దాంతో ఇక ఆ వరద నీరంతా దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకే చేరనుంది.
సాగర్‌లో 9 అడుగులు పెరిగిన నీటిమట్టం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం సాగర్‌కు నీరు రావాలంటే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తితేనే విడుదల అయ్యేవి. స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కృష్ణానీటి వాటా విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ముందస్తు ప్రణాళికను అనుసరించింది. అదే ఆనవాయితీని ప్రస్తుతం కొనసాగించక తప్ప లేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద మొదలైన నాటి నుంచే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దాంతో ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చి చేరిన వరద నీటితో నాగార్జున సాగర్‌లో వారం రోజుల్లో 9 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది.
సోమవారం సాయంత్రానికి సాగర్ నీటి మట్టం 512.60 అడుగులకు చేరగా 54,772 క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇన్‌ఫ్లోగా వస్తున్నది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా, నీటి నిల్వ 136.13 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం క్రస్ట్‌గేట్ల నుంచి వచ్చే నీటితో కలుపుకొని ఇన్‌ఫ్లో 1,62,466 క్యూసెక్కులు ఉండగా, మంగళవారం ఉదయానికి అది సాగర్‌ను తాకనున్నది. దాంతో సాగర్‌లోనూ వేగంగా నీటిమట్టం పెరుగనుంది.
ఎగువ నుంచి వరద భారీగా ఉండడంతో త్వరలోనే సాగర్‌కు కూడా జలకళ సంతరించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ముందుగానే మొదలైన వరద అక్టోబర్ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. దాంతో ఈసారి కూడా నాగార్జునసాగర్‌తోపాటు ఏఎమ్మార్పీ, వరద కాల్వ ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. దాంతో రైతులు కూడా హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సాగర్ నిండకపోవడంతో ఆయకట్టులో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
పెరుగుతున్న మూసీ నీటిమట్టం
కేతేపల్లి, జూలై 29 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి వనరు అయిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. సోమవారం 636.79 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అధికారులు అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు కాగా, ప్రస్తుతం 642.50(3.82 టీఎంసీలు) అడుగుల మేర నీరు ఉంది.
కృష్ణా పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి
నీలగిరి, జూలై 29 : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈత కోసమని, బట్టలు ఉతికేందుకని నదిలోకి తీసుకువెళ్లొద్దని, నది దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. కృష్ణా పరివాహక మండలాల అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను అప్రమత్తం చేసి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.