రామగిరి, జులై 07 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఐసెట్-2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ఐసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవితో కలిసి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,754 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 32,106 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది ఉత్తీర్ణతతో ర్యాంక్‌లు సాధించినట్లు వెల్లడించారు. ఫలితాల విడుదలలో టీఎస్ ఐసెట్ కో కన్వీనర్, ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మిర్యాల రమేశ్‌కుమార్, ఉన్నతవిద్యా మండలి కార్యదర్శి వెంకటేశం పాల్గొన్నారు.
నల్లగొండలోని పరీక్ష కేంద్రంలో 505 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 448 మంది క్వాలిపై (ఉత్తీర్ణత) సాధించారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెంది వడ్డెపల్లి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో 8వ (148.17 మార్కులు) ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. ఉత్తమ ర్యాంక్ సాధించిన శ్రీనివాస్‌గౌడ్‌కు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అధ్యాపక బృందం, మిత్రులు అభినందనలు తెలిపారు.
Nalgonda : ఐసెట్ ఫలితాల్లో నల్లగొండ వాసి శ్రీనివాస్‌గౌడ్‌కు 8వ ర్యాంక్