నకిరేకల్, డిసెంబర్ 04 : మన సంస్కృతి నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ పరీక్షలో తెలుగు విభాగంలో ఎస్పీఆర్ పాఠశాల ఆరో తరగతికి చెందిన బి. రిషికేష్ నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల కరస్పాండెంట్ బి.కన్నయ్య గౌడ్ తెలిపారు. హిందీ విభాగంలో 9వ తరగతికి చెందిన ఆర్.సమన్విత జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. విజేతలకు ఈ నెల 14న తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పురస్కారాల ప్రధానోత్సవం జరగనుందన్నారు. వీరికి నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు పరీక్షా సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్ ద్వివేది తెలిపారు. తెలుగు, హిందీ విభాగంలో మరో 40 మంది ప్రశంసా పత్రాలు పొందినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను గురువారం పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, పాఠశాల విజనరీ శ్రీపతి రెడ్డి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ సుందరి శివరామకృష్ణ, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు.