గరిడేపల్లి, జనవరి 08 : యువత క్రీడల వైపు దృష్టి సారిస్తే ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు మంచి భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుందని కోదాడ డీఎస్పీ రాపోలు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో పొనుగోడు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడల ద్వారా యువతలో సమిష్టి భావన, సహనశీలత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. క్రీడా పోటీల నిర్వహణతో గ్రామీణ ప్రాంతాల్లోని యువత ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు సైతం క్రీడలు దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చలిగంటి నరేశ్, సర్పంచ్ కటకం వేణు, ఉప సర్పంచ్ జోగు అరవింద్ రెడ్డి, మాజీ ఎంపీపీ కటకం ఆశా రమేశ్, మాజీ సర్పంచ్ జోగు సరోజినీ పిచ్చి రెడ్డి, నేలపట్ల వెంకటేశ్వర్లు, చామకూరి గురుస్వామి పాల్గొన్నారు.