నీలగిరి, ఆగస్టు18: పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా అధికారులకు 32, రెవెన్యూ శాఖకు 37 ఫిర్యాదులు వచ్చాయి. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రామోత్సవ్ క్రీడలకు సంబంధించిన గోడపత్రికను ఆవిషరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, ఇన్చార్జి డీఆర్వో అశోక్‌రెడ్డి ఆర్డీవోలు రమణారెడ్డి శ్రీదేవి డీఆర్డీవో శేఖర్‌రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లాలో పుష్కలంగా యూరియా
జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో యూరియా, ఎరువుల లభ్యత, నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా మారెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ పాల్గొన్నారు.
అధికారులపై కలెక్టర్ సీరియస్
నకిరేకల్, ఆగస్టు 18 : తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.80 వేలు మంజూరు చేసినా..ఇంకా పనులు ఎందుకు పూర్తిచేయలేదు? ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎనిమిది రోజుల్లో పనులు పూర్తిచేయాలంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం నకిరేకల్ మండలం చందుపట్లలో ఆమె పర్యటించారు. గ్రామంలోని ఓ కాలనీలో తాగునీటి సమస్య ఆమె దృష్టికి రావడంతో పనులను పరిశీలించారు. అనంతరం పనులు పూర్తికాకపోవడంతో ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఆమె వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తాసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నర్సింహా, ఏఈ మాధవి, ఇన్‌ఛార్జి ఎంపిఓ కె.మధు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదు
సూర్యాపేట, ఆగస్టు 18 : సూర్యాపేట జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వివరించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సూర్యాపేట జిల్లా పరిస్థితిని మంత్రికి వివరించారు. జిల్లాకు ఇప్పటి వరకు 29వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఈ నెలలో 3800 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో వారంలో స్టాక్ రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ప్రతి రోజూ 600 నుంచి 700 మెట్రిక్ టన్నుల వరకు విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా ఎస్పీ కె.నరసింహ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు.